మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు.
జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు ఆదివారం ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం ప్రకారం... గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్యకు శ్రీశైలం, మహేశ్, చంద్రశేఖర్, కుమార్ అనే నలుగురు కుమారులు ఉన్నారు. వీరు ఇటీవలే గ్రామంలో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. ఆ స్థలంలో కురుమ, యాదవ సంఘం వారు భవనం నిర్మాణం కోసం పునాదులు తీశారు.
దీంతో ఇరు వైపుల వారి మధ్య వివాదం మొదలైంది. ఆ స్థలం తమదంటే, తమదని వారి మధ్య వివాదం నడుస్తోంది. దీంతో జడ్చర్లకు చెందిన ఓ రాజకీయ నేత మధ్యవర్తిత్వం వహించాడు. ఆయన సంఘం వారికే వంత పాడుతున్నాడంటూ మనస్తాపం చెందిన వెంకటయ్య, ఆయన నలుగురు కుమారులు ఆదివారం జడ్చర్లకు వెళ్లారు. మధ్యవర్తిత్వం వహించిన నేత ఇంటి వద్దే పురుగుల ముందు తాగారు. వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శ్రీశైలం, మహేశ్ మృతి చెందారు. చంద్రశేఖర్, కుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. వెంకటయ్య పరిస్థితి నిలకడగా ఉంది.