వన రక్షక వనితలు
అడవి తల్లి రక్షణలో ఆడమగ తారతమ్యం లేకుండా స్మగ్లర్లకు సింహస్వప్నంగా నిలుస్తూ వనాన్ని రక్షిస్తున్న వనితలు వారు. ఏటూరునాగారం, మంగపేట, అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో మహిళా బీట్ అధికారులుగా పనిచేస్తూ తమలో అణువణువు ధైర్య సాహసాలు నిండి ఉన్నాయని నిరూపిస్తున్నారు. విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధించిన విజయాలు, శత్రువు ఎదురైనప్పుడు ఎదుర్కొనే తీరు.. తదితర విషయాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
- ఏటూరునాగారం
ఏటూరునాగారం, మంగపేట, మండలాల్లోని సుమారు 37 గ్రామ పంచాయతీల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయి. అడవులను రక్షించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు నిరంతరం తపిసున్నారు మహిళా బీట్ అధికారులు. అడవిలోని చెట్లు నరికివేతకు గురికాకుండా నిత్యం నిఘా కాస్తున్నారు. అటవీ సంపద స్మగ్లర్ల బారిన పడకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కళ్లు చించుకున్నా ఒక్క మనిషి కూడా కనబడని అడవిలో సంచరిస్తూ అడవికి రక్షణగా నిలుస్తున్న ధీరవనితలు.. విధినిర్వహణలో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మనసు విప్పి మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే..
మృగాలు ఎదురైతే చెట్లు ఎక్కుతాం
అడవిలో సంచరించే క్రమంలో ప్రమాదకరమైన జంతువులు ఎదురైతే చెట్లు ఎక్కి నక్కి కూర్చుంటాం. అవి వెళ్లే వరకు శబ్దం చేయకుండా ఉండిపోతాం. అలాగే కొంతమంది జంతువులను హతమార్చేందుకు విద్యుత్ తీగలతో ఉచ్చులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఎండిపోయిన కర్రలను ముందుకు జరుపుకుంటూ అడవిలోకి వెళ్తాం. ఒక వేళ విద్యుత్ తీగలతో ఉచ్చు ఉంటే వెంటనే ఎండు కర్ర కాలిపోతుంది. ఇలా రక్షించుకుంటాం. ఎక్కువగా వాగులు, వంకలు ఉన్న ప్రాంతంలో జంతువులు వస్తాయని వేటగాళ్లు ఉచ్చులు పెడుతుంటారు. ఆ ప్రాంతాలను ముందే పసిగట్టి అడవిలోకి వెళ్తుంటాం. జంతువుల అడుగుల ఆధారంగా ఎలాంటి జంతువు అనేది గుర్తిస్తాం.
- సింగారపు రజిత, ఏటూరు బీట్ అధికారి
వర్షాకాలంలో టేకాకులే గొడుగులు
వర్షాకాలంలో అడవిలో సంచరించే క్రమంలో వర్షం కురిస్తే టేకు ఆకులు, ఇతర పెద్ద ఆకులను గొడుగులా ఏర్పాటు చేసుకుని తలపై పెట్టుకుంటాం. ఇలా తలదాచుకోవడానికి దగ్గర్లో ఉండే రాతి గుహలు, బండరాళ్ల నీడలో తలదాచుకుంటాం. ఎక్కువగా వర్షం పడితే తడిసిపోక తప్పదు. వర్షాకాలంలో అడవుల్లో పచ్చదనం ఎక్కువగా ఉండడంతో పాములు, విషకీటకాలతో హాని కలిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పొడుగాటి షూ ధరించి వెళ్తుంటాం. విషకీటకం కుడితే తెలిసిన వైద్యం చేసుకుని గ్రామాల్లోకి రావడానికి ప్రయత్నిస్తాం.
కుర్సం తార, ముల్లకట్టం,
రాంపూర్ బీట్ అధికారిఅ
ఊట నీళ్లే మాకు తాగునీరు
అడవిలోని చెట్లకు నంబర్లు రాసేందుకు వెళ్లే క్రమంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాలినడకన వెళ్లాలి. అలా వెళ్లే క్రమంలో దాహం వేస్తే అడవిలో ఉండే ఊ ట నీళ్లను తాగేందుకు ఉపయోగిస్తాం. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉం టుంది. కొన్నిసార్లు అడవిలో రెండు రో జు లపాటు ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో అడవిలో దొరికే పండ్లు తింటూ కడుపునింపుకుంటాం. చెట్లు నరికివేతకు గురైతే దానిమీద ఉన్న గుండ్రని గీత ల ఆ దారంగా వాటి వయసు గుర్తిస్తాం. దీ ని వల్ల ఆ కలపను త్వరగా గుర్తుపట్టి పట్టుకు నే వీలుంటుంది. విధి నిర్వహణలో ఆ టుపోట్లు ఉన్నా సంతోషంగా పనిచేస్తున్నాం.
- కొర్నిబెల్లి శోభారాణి,
తిమ్మాపురం బీట్ అధికారి
పసిగట్టి పట్టుకుంటాం
రాత్రివేళ స్మగ్లర్ కలపను అక్రమంగా తరలించుకుపోతున్నాడని సమాచారం అందితే సిబ్బందితో కలిసి బేస్‌క్యాంపునకు చేరుకుంటాం. ఎవరికీ అనుమానం రాకుండా నెగడు చాటునుంచి ఎడ్లబండ్ల కదలికలు గుర్తు పడతాం. తర్వాత బండ్లు ఎటువైపు వెళ్తున్నాయనే విషయాన్ని పసిగట్టి రక్షణ కోసం కర్రలతో కాపుకాస్తాం. అవి రాగానే అందరం ఒకేసారి పెద్దగా అరుస్తూ పట్టుకుంటాం. ఇటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి.
-కాక విజయ, తొండ్యాల
లక్ష్మీపురం బీట్ అధికారి