కరెంటు కాటుకు యువ రైతు బలి
చేగుంట : ట్రాన్స్‌ఫార్మర్ నుంచి బోరు మోటార్లకు వచ్చే విద్యుత్ సరఫరాను నిలివేసే క్రమంలో ఓ యువ రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలనును వదిలాడు. ఈ సంఘటన మండలంలోని ఉప్పర్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అశోక్‌గౌడ్ (26) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఉదయం తన పొలంలో పనులు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో బోరుకు సంబంధించిన మోటారులో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. దీంతో దానిని మరమ్మతులు చేసేందుకు ట్రాన్స్‌ఫార్మర్ నుంచి సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపేందుకు నిర్ణయించాడు. అందులో భాగంగానే ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు ఏవీ స్విచ్ ఆఫ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. చుట్టు పక్కల రైతులు ప్రమాదాన్ని పసిగట్టి రక్షించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో రైతులు కుటుంబ సభ్యులు, చేగుంట పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి చేరుకుని శవ పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య సంధ్య ఒక కూతురు రుచిక ఉన్నారు. కాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే అశోక్‌గౌడ్ కరెంటు షాక్‌కు గురై మృతి చెందాడని గ్రామస్తులు, రైతులు ఆరోపించారు. మృతుడి కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి : మరో ఘటనలో విద్యుదాఘాతానికి గురై ఎద్దు మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని పోసాని పల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రమౌళి తన వ్యవసాయ పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఎద్దును మేపుతున్నాడు. ఈ క్రమంలో ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రమాదవశాత్తు తాకకడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు మృతితో తనకు రూ. 35 వేలు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమయ్యాడు.