వంగరలోని పీవీ నర్సింహారావు స్వగృహం
భీమదేవరపల్లి : బహుభాషా కోవిదుడిగా, మౌనమునిగా, రాజనీతిజ్ఞుడిగా పేరుగడించి భారతదేశ ప్రధానిగా అత్యున్నత పదవిని అధిరోహించి తెలుగుఖ్యాతిని దేశవిదేశాల్లో ఇనుమడింపజేసిన తెలుగు తేజం, వంగర ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా పీవీ జయంతి, వర్ధంతి వేడుకలను హైదరాబాద్‌తోపాటుగా ఆయన జన్మస్థలమైన వంగరలో అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించడంతో తెలుగు ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆ హామీ వంగరలో నెరవేర్చకపోవడంతో గ్రామస్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గురువారం పీవీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
పూర్వ కరీంనగర్ జిల్లా(ప్రస్తుత వరంగల్ అర్బన్ జిల్లా) భీమదేవరపల్లి మండలం వంగరలో 1921 జూన్ 28న పీవీ నర్సింహారావు జన్మించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతోపాటుగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకే వన్నె తెచ్చారు.
పీవీ ప్రధాని కానున్న సమయంలో వంగరలో పలు అభివృద్ధి పనులు జరగడంతో పాటుగా నిత్యం రాష్ట్ర, కేంద్ర మంత్రుల పర్యటనలతో సందడిగా ఉండేది. పీవీ ప్రధాని అయ్యాక వంగలో సీసీ రోడ్లు, గ్రంథాలయం, గురుకుల పాఠశాల, తాగు నీటి బావి, పోలీస్‌స్టేషన్ తదితర అభివృద్ధి పనులు జరిగాయి.
దీక్షలు చేసినా శూన్యమే..
పాలకులు మరిచినా ఇక్కడి ప్రజానీకం మాత్రం పీవీని తమ గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే కాబోలు వంగరలో 2013 సంవత్సరం పీవీ విగ్రహాన్ని చందాలతో ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు వచ్చినా.. రాకున్నా వారే జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహించకుంటున్నారు.
పీవీ మరణం నుంచి నేటి వరకు ఆయనకు ఏదోవిధంగా అవమానం జరుగుతూనే ఉంది. పీవీకి భారత రత్న ఇవ్వాలని, జిల్లాకు పీవీ పేరు పెట్టాలని, ఢిల్లీలో శాంతి వనం ఏర్పాటు చేయాలని ఆయన 9వ వర్ధంతిని పురస్కరించుకొని గ్రామంలోని పీవీ విగ్రహం వద్ద ప్రజలు రాజకీయాలకతతీంగా 48 గంటల పాటు దీక్ష చేపట్టినా ఏ నాయకుడు అటుగా రాలేదు.
వెలవెలబోతున్న విగ్రహం
వంగరలో పీవీ నర్సింహారావు విగ్రహ నిర్మాణ సమయంలో గార్డెన్‌ను నిర్మిస్తామంటూ నాయకులు ఇచ్చిన హామీ సైతం నెరవేరలేదు. నూతన రాష్ట్రంలో పీవీ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను స్వగ్రామం వంగరతో పాటుగా హైదరాబాద్‌లో అధికారికంగా నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కేవలం మొదటి సంవత్సరం మాత్రమే జయంతి వేడుకలకు ఆర్డీఓ హాజరయ్యారు. అనంతరం ఆ కార్యక్రమాలను మరిచిపోయారు. ఈనె ల 28న పీవీ జయంతి సందర్భంగా అధికారిక ఏర్పాట్లు లేకపోవడంతో వంగర బోసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment