రైతులను అన్నివిధాలా ఆదుకుంటాం
రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నిర్మల్ టౌన్: రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని రాష్ట్ర గృహనిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నిర్మల్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతన చైర్మన్ దేవేందర్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు సాగునీరు అందించడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. పెండింగ్‌లో ఉన్నప్రాజెక్టులన్నింటినీ సత్వరమే పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయశాఖలో ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే అమ్ముకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఇందులో భాగంగానే గోదాంలను నిర్మించనున్నట్లు తెలిపారు.
అలాగే రూ.కోటి నిధులతో నిర్మల్‌లో కోల్డ్‌స్టోరేజీ పనులను ప్రారంభించనట్లు తెలిపారు. నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం మరిన్ని విద్యుత్‌సబ్‌స్టేషన్‌లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తయితే నిర్మల్‌లో 50వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. పట్టణప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా స్వర్ణనది నీటిని ఎస్సారెస్పీకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటికే స్వర్ణనదిపై 12చెక్ డ్యాంల నిర్మాణపనులు ప్రారంభించనట్లు తెలిపారు. రానున్నరోజుల్లో రైతు సంక్షేమంకోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తుందన్నారు.
అనంతరం దేవేందర్‌రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. రైతులకు అన్ని రకాల సహాయసహకారాలు అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందులో ఆర్డీవో శివలింగయ్య, మున్సిపల్ చైర్మన్ అప్పాలగణేశ్, టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రామేశ్వర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్, గౌతంరెడ్డి, తహసీల్దార్ జాడి రాజేశ్వర్, కమిషనర్ త్రియంబకేశ్వర్‌రావు తదితరులు ఉన్నారు.