కొరత కథలొద్దు
గజ్వేల్: జిల్లాలో యూరియా పంపిణీకి సంబంధించి వాస్తవ పరిస్థితులకు అద్దంపడుతూ ‘సాక్షి’ ప్రచురించిన కథనం నేపథ్యంలో బుధవారం సాయంత్రం జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ గజ్వేల్‌కు చేరుకున్నారు. గజ్వేల్ డెవలప్‌మెంట్ అథారి టీ ఓఎస్‌డీ హన్మంతరావుతో కలిసి మండల పరిషత్ కార్యాలయ సమావేశమందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఏడీఏ శ్రావణ్‌కుమార్‌ను అడిగి యూరియా పంపిణీ వివరాలను తెలుసుకున్నారు.
‘ఎమ్మార్పీ’ నిబంధనతో ‘నో స్టాకు’
ఎమ్మార్పీ కంటే ఒక్క పైసాకు ఎక్కువగా అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేయడం..అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తుండడంతో కొందరు డీలర్లు యూరియా నిల్వలను తెప్పించడంలో విముఖత చూపుతున్నట్లు సమీక్ష సందర్భంగా ఏడీఏ శ్రావణ్‌కుమార్ ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌కు తెలిపారు. ప్రస్తుతం ఓ మోస్తరు వర్షం కురిసినా రైతులంతా సాగుకు సిద్ధమవుతారని, ఈ సమయంలో యూరియా పంపిణీ కష్టసాధ్యమవుతుందని కూడా ఏఓ శ్రావణ్‌కుమార్ వివరించారు.
ఐకేపీ కేంద్రాలను పునరుద్ధరించండి
వ్యాపారులు కావాలనే యూరియా కొరత సృష్టిస్తున్నట్లు తెలుసుకున్న ఇన్‌చార్జి కలెక్టర్ శరత్ ప్రత్యామ్నాయ మార్గాలను వెతికారు. ఈ క్రమంలోనే ఐకేపీ కేంద్రాల ద్వారా యూరియాను పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, వర్గల్, జగదేవ్‌పూర్, ములుగు,కొండపాక మండలాల్లో ఎరువుల పంపిణీపై ఆసక్తి, సమర్థత ఉన్న గ్రామైక్య సంఘాలను సంబంధిత శాఖాధికారులతో సమన్వయం చేసుకొని వారంరోజుల్లో ఎంపిక చేయాలని ఏడీఏ శ్రావణ్‌కుమార్‌ను ఆదేశించారు.
ఎంపిక చేసి సంఘాలకు వెంటనే లెసైన్స్‌లు ఇచ్చి ఎరువుల కేంద్రాలను ప్రారంభించాలని సూచించారు. అదేవిధంగా సహకార సంఘాల ద్వారా కూడా ఎరువులను సమర్థవంతంగా పంపిణీ చేయాలన్నారు. అనంతరం గజ్వేల్ నియోజకవర్గంలో పారిశుద్ధ్యలోపం, అతిసార వ్యాప్తి, బోగస్ రేషన్ కార్డుల ఏరివేత, ఇంటి నిర్మాణ పథకం, దళితులకు మూడెకరాల భూ పంపిణీ తదితర అంశాలపై కూడా ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్షించారు. సమావేశంలో సిద్దిపేట ఆర్‌డీఓ ముత్యంరెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గంలోని ఎంపీడీఓలు, తహశీల్దార్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.