సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రంలో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాదారులు పాగా వేసేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన స్థలాల్లో అక్రమంగా టేలాలు వేస్తూ అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల పట్టింపులేమితో జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీస్థలాలు కబ్జాకు గురవుతున్నాయి.
పునర్విభజనలో భాగంగా జిగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడడం.. గ్రేడ్–1 మున్సిపాలిటీగా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఖాళీస్థలాల గురించి పట్టించుకోకపోవడంతో బల్దియా భారీగా ఆదాయం నష్టపోతోంది. జగిత్యాలలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న ఉద్యానవనం, అగ్నిమాపకశాఖ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఖాళీస్థలాల్లో ఎన్నో టేలాలు వెలిశాయి.
టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆడింది ఆటగా నడుస్తుంది. వాస్తవంగా అక్కడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తే కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. గతంలో అంగడిబజార్ ప్రాంతంలో ఉన్న బల్దియాస్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి.. టెండర్లు వేస్తే ఒక్కో షాపునకు రూ.4లక్షల నుంచి రూ.5 లక్షలు పలికింది.
వీటి ద్వారా నెలకు రూ.30 వేలు వరకు అద్దె వస్తుంది. ప్రస్తుతం కూడా పట్టణంలోని ఖాళీస్థలాల్లో ఆక్రమణలను తొలగించి షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తే బల్దియాకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అంగడిబజార్‌లో నిర్మించిన షాపింగ్‌కాంప్లెక్స్‌లో పై అంతస్తు నిర్మిస్తే మరింత ఆదాయం పొందే అవకాశం ఉంది.
అలాగే ఎంపీడీవో కార్యాలయం, టౌన్‌హాల్ సమీపంలోనూ ఆక్రమణలను తొలగించి షాపింగ్‌కాంప్లెక్స్ నిర్మిస్తే బల్దియాకు అత్యధికంగా ఆదాయం లభించనుంది. ప్రస్తుతం జగిత్యాల మున్సిపల్ ఆస్తిపన్ను రూ.5 కోట్లు ఉంది. వీటిని నిర్మిస్తే మరింత ఆదాయం సమకూరనుంది.
అన్ని ఆక్రమణలే..!
జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్తబస్టాండ్,పాతబస్టాండ్, తహసీల్‌చౌరస్తా ప్రధాన మార్గాల్లోని రోడ్లలో నిత్యం ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చిన్న వ్యాపారం పేరిట రేకులషెడ్డు ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీకి ఎంక్రోజ్‌మెంట్ కింద కొద్దిమేర కిస్తులు చెల్లిస్తున్నారు. పాలకవర్గం అధికారులు స్పందించి వీటన్నింటిని తొలగించి పెద్ద ఎత్తున కాంప్లెక్స్‌లు నిర్మించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అంతా బినామీలే..
మున్సిపాలిటీ స్థలాలను కొందరు ఆక్రమించుకొని వాటిలో షెడ్లు వేసి అద్దెకిస్తున్నారు. దాదాపు నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పొందుతున్నారు. గతంలో స్థలాల్లో ఉన్న వారు రేకులషెడ్లు వేసి వాటిని అద్దెకు ఇచ్చారు. వాణిజ్య వ్యాపారాలు అత్యధికంగా జరిగే స్థలాలు కావడంతో గత్యంతరం లేక వారు చెప్పిన అద్దెను చెల్లిస్తున్నారు.
ఇలా బల్దియా ఆదాయానికి గండి కొడుతూ వారు ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారు. మున్సిపాలిటీ స్థలానికి వీరే యజమానులు వ్యవహరిస్తుండడం గమనార్హం. పాలకవర్గం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ చూపి విలువైన ఖాళీస్థలాల్లో అక్రమంగా వెలసిన షెడ్లను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మించాలని కోరాతున్నారు.
నోటీసులు జారీ చేశాం
జిల్లా కేంద్రంలోని పలు రోడ్లపై వెలసిన ఆక్రమణ షెడ్ల వారికి నోటీసులు సైతం జారీ చేశాం. మున్సిపల్ దృష్టికి వచ్చింది. త్వరలోనే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. షాపింగ్‌కాంప్లెక్స్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించేలా చర్యలు తీసుకుంటాం.
– సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment