
గ్యాస్ సిలిండర్ పేలుడు : ముగ్గురికి గాయాలు
యాదాద్రి : యాదాద్రి జిల్లాలో శనివారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బీబీనగర్ మండలం ఇందిరమ్మ కాలనీలో ఈ ప్రమాదం సంభవించింది.
ఎస్సై సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన పెద్దపాటి లచ్చిరెడ్డి ఇంట్లో వంట చేస్తుండగా శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో లచ్చిరెడ్డి, అతని భార్య రాజమ్మకు తీవ్రగాయాలు కాగా.. లక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద శబ్ధం రావడాన్ని గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. పేలుడు ధాటికి ఇళ్లు పాక్షికంగా దెబ్బతింది.