సాక్షిప్రతినిధి, కరీంనగర్: గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణకు సర్వం సన్నద్ధమవుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలు, నియమావళి ప్రకారం అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరింది. ఇప్పటికే పోలింగ్‌బాక్సులు, జిల్లా, మండల కేంద్రాలకు చేరుకున్నాయి. ఓటర్ల జాబితా సవరణ, నమోదు, తుది జాబితా ప్రకటన ఈనెల 17న వెలువడనుంది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలపై అధికారులు కసరత్తు ముగిసినట్లే. పంచాయతీ ఎన్నికలు ఖాయమన్న ప్రచారం జోరందుకోవడంతో రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో తలపడేందుకు సన్నద్ధమవుతున్నాయి. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాల్లోని గ్రామ పంచాయతీలలో అధికారుల కసరత్తు పూర్తిదశకు చేరిన నేపథ్యంలో పంచాయతీ యంత్రాంగం, మండల అధికారులు గ్రామ పంచాయతీల వారీ గా తుది జాబితాను విడుదల చేసే పనిలో నిమగ్నం అయ్యారు.
17న ఓటర్ల ఫైనల్ జాబితా.. తుదిదశకు చేరిన కసరత్తు
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా సవరణ కీలకం. ఈ ప్రక్రియలో భాగంగా గతనెల 30న ఓటర్ల జాబితాను ప్రదర్శించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. పంచాయతీ, వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఈ నెల 30న గ్రామపంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఈ జాబితాపై ఈనెల 1న జిల్లాస్థాయిలో, 3న మండలస్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. 1 నుంచి 8 వరకు వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, 13వరకు అభ్యంతరాలను పరిష్కంచనున్నారు. మిగిలిన నాలుగురోజుల్లో అన్ని రకాలుగా పరిశీలన చేసి 17న గ్రామ పంచా యతీ, వార్డులవారీగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. ఈ సారి గ్రామపంచాయతీ వారీగా జాబితా సిద్ధం చేసిన తర్వాత వార్డుల వారీగా కూడా రూపొందించనున్నారు. సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విధంగా ఈ జాబితా ఉంటుందని ఇదివరకే అధికారులు ప్రకటించారు. గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న వార్డుల సంఖ్య, స్థానికంగా ఉన్న జనాభాకు అనుగుణంగా సంబంధించిన వార్డులో ఓటర్లను కేటాయిస్తారు. అదేవిధంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసేటప్పుడు ఒకే ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరినీ ఒకే వార్డులోకి వచ్చేలా చేర్చి ఈ సారి జాబితాను వెల్లడించనున్నారు. ఒక ఇంటి నంబరులో ఎంత మంది ఓటర్లు ఉన్నా వారంతా ఒకటే వార్డు పరిధిలోకి తీసుకువస్తున్నారు.
329 గ్రామ పంచాయతీలు, 313 జీపీలకే ఏర్పాట్లు..
జనవరిలో విడుదల చేసిన జాబితా ప్రకారం ఈసారి పంచాయతీ ఎన్నికలు జరిగే 313 పంచా యతీలకు మొత్తంగా 3,65,366 మంది ఓటర్లున్నట్లు అధికారులు తేల్చారు. ఇటీవల చేపట్టిన ఓటర్ల సవరణ, చేర్పులు, మార్పులు, నమోదులో భాగంగా మరో 15 పైచిలుకు ఓటర్లు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు భావిస్తున్నాయి. జిల్లా విభజన తర్వాత కరీంనగర్ జిల్లాలో 276 గ్రామపంచాయతీలు మిగలగా.. కొత్తగా ఏర్పాటైన 53 పంచాయతీలను కలుపుకుని మొత్తంగా పంచాయతీల సంఖ్య 329కి పెరిగింది. ఇందులో నగర పంచాయతీలుగా ఉన్న హుజూరాబాద్, జమ్మికుంట పురపాలిక హోదాను దక్కించుకున్నాయి. వీటికి అనుబంధంగా ఉన్న ఆరు గ్రామాలు విలీనమయ్యాయి. కరీంనగర్ చుట్టు పక్కల ఉన్న మరో 8 గ్రామాలు కార్పొరేషన్ పరిధిలోకి వెళ్లడంతో మొత్తంగా మార్పులు చేర్పుల తరువాత 313 గ్రామ పంచాయతీలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. ఈ గ్రామ పంచాయతీల పరిధిలో 3,283 వార్డులున్నాయి. 1,84,068 పురుష ఓటర్లు, 1,81,284 మహిళా ఓటర్లు, 14 మంది ఇతరులు కలిపి మొత్తం 3,65,366 ఓటర్లున్నారు. పంచాయతీ ఎన్నికల కసరత్తు తుదిదశకు చేరుతుండగా.. ఈ ఎన్నికల్లో పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు సైతం సమాయత్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పంచాయ తీ పాలకవర్గాల గడువు జూలై చివరిలో ముగియనుంది. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా స్థానిక పంచాయతీల్లో ప్రతిఓటూ కీలకమని గుర్తించిన ఆయా పార్టీల నాయకులు సైతం ముందస్తుగానే తమ కదలికల్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఊరూరా అర్హులైన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చడంతోపాటు అనర్హులను తొలగించే కార్యక్రమంలోను చురుగ్గానే పాల్గొన్నారు.
తుదిదశకు కసరత్తు
షెడ్యూల్ ప్రకారం మే 17న తుది జాబితా విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ఎన్నికల సంఘం నియమావళి, ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే పోలింగ్‌బాక్సులు కూడా వచ్చాయి. అభ్యంతరాలపై పరిశీలన అనంతరం ఫైనల్ ఓటర్ల లిస్టును ప్రకటిస్తాం.
– నారాయణరారావు, డీపీవో
Comments
Please login to add a commentAdd a comment