సాక్షి, వికారాబాద్ : సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసంలో ఆజాద్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిని బయటకు వదిలి కేసీఆర్ కొడంగల్‌కు రావాలని సవాలు చేశారు. రేవంత్‌ను అరెస్ట్ చేసి ఇక్కడికి రావడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు.
ఈరోజు సీఎం సీటులో కేసీఆర్ ఉండొచ్చని, రేపు అదే సీటులో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చని అన్నారు. అర్థరాత్రి రేవంత్‌ను అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఆయన కుటుంబానికి, తెలంగాణ సమాజానికి కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆజాద్ డిమాండ్ చేశారు. కాగా ఎన్నికల ప్రచారానికి నేడు (బుధవారం) చివరి రోజు కావడంతో ఉదయమే ప్రచారానికి వెళ్లిన రేవంత్ కోసం ఆజాద్ గంటపాటు ఎదురుచూశారు. మంగళవారం కేసీఆర్ కోస్గి సభ ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారంటూ రేవంత్‌ను మంగళవారం అర్థరాత్రి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment