♦ మంత్రులు కేటీఆర్, ఈటలకు
♦ జెడ్పీ చైర్మన్ల వినతిపత్రాలు
సాక్షి, హైదరాబాద్: జిల్లా పరిషత్‌ల వద్ద ప్రస్తుతం ఎటువంటి నిధులు లేనందున, ఒక్కో జిల్లా పరిషత్‌కు రూ. 100 కోట్లు ఇవ్వాలని పలువురు జెడ్పీ చైర్మన్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినందున అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావును, ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ను శనివారం సచివాలయంలో కలసి వినతిపత్రాలు అందజేశారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా గ్రామ పంచాయతీలకు అందుతున్న 100 శాతం నిధుల్లో జెడ్పీలకు వాటా తిరిగి ఇచ్చేవిధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని మంత్రులను కోరారు.
2011 జనాభా లెక్కల ప్రకారం తలసరి గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం తగిన నిష్పత్తిలో పెంచలేదని గుర్తు చేశారు. రాజ్యాం గ సవరణ ప్రకారం పంచాయతీ వ్యవస్థకు బదలాయించాల్సిన 29 అంశాలను వెంటనే జెడ్పీల పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మంత్రులను కలసిన జెడ్పీ చైర్మన్లలో తుల ఉమ (కరీంనగర్), సునీత (రంగారెడ్డి), బాలు నాయక్ (నల్లగొండ), డి.రాజు (నిజామాబాద్), రాజమణి (మెదక్), కవిత (ఖమ్మం), భాస్కర్ (మహబూబ్‌నగర్), పద్మ (వరంగల్), శోభారాణి (ఆదిలాబాద్) ఉన్నారు.