‘దోస్త్‌’ లేకుంటే రీయింబర్స్‌మెంట్‌ లేనట్లే.. | Government has decided not to issue fees reimbursement in colleges not covered by degree online | Sakshi
Sakshi News home page

‘దోస్త్‌’ లేకుంటే రీయింబర్స్‌మెంట్‌ లేనట్లే..

Published Sat, May 25 2019 2:10 AM | Last Updated on Sat, May 25 2019 2:10 AM

Government has decided not to issue fees reimbursement in colleges not covered by degree online - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల (దోస్త్‌) పరిధిలోకి రాని కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. అస్తవ్యస్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలను క్రమబద్ధం చేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ ప్రవేశాలను చేపడుతుంటే.. కొన్ని కాలేజీలు మాత్రం కోర్టును ఆశ్రయించి ఆన్‌లైన్‌ ప్రవేశాల పరిధిలోకి రాకుండా సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో అలాంటి కాలేజీల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అవసరం లేదని అనుకుంటేనే విద్యార్థులు వాటిల్లో చేరాలని సూచించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కావాలనుకునే విద్యార్థులు మాత్రం ఆ కాలేజీల్లో చేరితే నష్టపోవాల్సి ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ మెమో జారీ చేసినట్లు విద్యా శాఖ వర్గాలు వెల్లడించారు. ఇదే విషయాన్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేసే సంక్షేమ శాఖలకు కూడా ప్రభుత్వం తెలిపింది.

27 టాప్‌ కాలేజీలు దోస్త్‌కు దూరం
రాష్ట్రంలో 1,084 వరకు ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉండగా వాటిల్లో 4.2 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏటా 2.2 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అవుతుండగా, దాదాపు 23 వేల సీట్లు దోస్త్‌ పరిధిలో లేని కాలేజీల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం 47 కాలేజీలు దోస్త్‌ పరిధిలో లేవు. అవి సొంతంగానే ప్రవేశాలు చేపడుతున్నాయి. అందులో 20 మైనారిటీ కాలేజీలు సొంతంగా ప్రవేశాలు చేపట్టుకునేందుకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. మరో 27 టాప్‌ కాలేజీలు మాత్రం కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి.

ఇలా దాదాపు 15 వేలకు పైగా సీట్లను ఆయా కాలేజీలు భర్తీ చేసుకుంటున్నాయి. వాటిని ఆన్‌లైన్‌ పరిధిలోకి తెచ్చేందుకు దోస్త్‌ కమిటీ ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ కాలేజీల్లో వార్షిక ఫీజులు రూ.30 వేల నుంచి రూ.60 వేల వరకు ఉందని, యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజు మాత్రం రూ.25 వేలకు (యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజుకు అదనంగా రూ. 10 వేలు వసూలు చేసుకునేలా కల్పించిన వెసులుబాటుతో కలిపి) మించి లేదని, దానివల్ల తాము కాలేజీలను కొనసాగించలేమని సదరు యాజమాన్యాలు పేర్కొన్నట్లు తెలిసింది.

కోర్టుకెళ్లి మరీ..
తాము దోస్త్‌ పరిధిలోకి వస్తే యూనివర్సిటీ నిర్ణయించిన ఫీజునే వసూలు చేయాల్సి వస్తుందని, దానివల్ల తమ కాలేజీలు, కోర్సుల నిర్వహణ సాధ్యం కాదని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించి సొంతంగా ప్రవేశాలు చేపడుతున్నాయి. 2019–20 విద్యా సంవత్సరంలోనూ 27 కాలేజీలు సొంతంగా ప్రవేశాలకు చర్యలు చేపట్టాయి. దీంతో వాటిల్లో చేరే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతేడాది జారీ చేసిన ఉత్తర్వులనే ఈ ఏడాది అమలు చేయాలని ఆదేశించింది.

ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఈ–పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా దోస్త్‌ చర్యలు చేపట్టింది. దోస్త్‌ ఆధ్వర్యంలో సీట్లు పొందిన విద్యార్థుల జాబితాలను ఈ–పాస్‌ విభాగానికి కూడా కాలేజీలు, దోస్త్‌ కమిటీ పంపిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ–పాస్‌ విభాగం వాటినే పరిగణనలోకి తీసుకొని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మంజూరు చేసేలా చర్యలు చేపడుతున్నట్లు దోస్త్‌ ఉన్నతాధికారి వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement