143 స్కూల్స్‌ మూసివేత? | government schools merge in rangareddy district | Sakshi
Sakshi News home page

143 స్కూల్స్‌ మూసివేత?

Published Thu, Dec 21 2017 12:26 PM | Last Updated on Thu, Dec 21 2017 12:26 PM

government schools merge in rangareddy district - Sakshi

సర్కారు బడులకు మూసివేత ముప్పు ఉందా? రేషనలైజేషన్‌ (హేతుబద్ధీకరణ) దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా? అంటే.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. నిర్ధిష్ట సంఖ్య కంటే విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలపై అధికారులు కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఆ బడుల జాబితాను జిల్లా విద్యాశాఖ రూపొందించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 


సాక్షి, రంగారెడ్డి జిల్లా /కొత్తూరు:  నిరుపేద కుటుంబాల పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని మూతపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం పాఠశాలల రేషనలైజేషన్‌ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. విద్యార్థుల సంఖ్య అతి తక్కువగా ఉన్న బడుల జాబితాను సిద్ధం చేయాలని ఇటీవల విద్యా శాఖ డైరక్టరేట్‌ నుంచి మండల విద్యాధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. పది మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలు, 20 మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత బడులు, 30 మంది విద్యార్థులూ లేని ఉన్నత పాఠశాలల వివరాలు సేకరించాలని చెప్పారు. దీంతోపాటు నిర్ధిష్ట సంఖ్య కంటే విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్ల సమీపంలోని.. ప్రభుత్వ బడులు, వీటి మధ్య దూరం, భౌగోళికంగా ఉన్న అడ్డంకులు (జాతీయ రహదారులు, అడవులు తదితర), రవాణా సౌకర్యం, రోడ్డు సదుపాయం తదితర వివరాలు కావాలని కోరింది. ఈ మేరకు అన్ని మండలాల విద్యాధికారులు దాదాపు వారం రోజుల పాటు కసరత్తు చేసి సమగ్ర వివరాలను సంపాదించి జిల్లా విద్యాశాఖకు అందజేశారు. అక్కడ ఉన్నతాధికారులు జాబితాను తయారు చేసి పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు పంపినట్లు తెలిసింది. ‘సాక్షి’కి అందిన సమాచారం ప్రకారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 143 స్కూళ్లు మూతపడనున్నట్టు తెలుస్తున్నది. 

ఉన్నత బడులకు ముప్పు లేనట్లే.. 
కొంతకాలంగా స్కూళ్ల హేతుబద్ధీకరణ చేపట్టాలన్న సంకేతాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూనే ఉంది. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల నుంచి వ్యతిరేక వ్యక్తమవుతుండడంతో వెనకడుగు వేసింది. ఈ నేపథ్యంలో గతేడాది కూడా విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూళ్ల వివరాలను విద్యాశాఖ సేకరించింది. తాజాగా వచ్చిన ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. గత నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని జాబితాను రూపొందించారు. దీని ప్రకారం మొత్తం 143 స్కూళ్లలో నిర్దిష్ట సంఖ్య కంటే తక్కువగా విద్యార్థులు ఉన్నారు. పదిలోపు విద్యార్థులు నమోదైన ప్రాథమిక పాఠశాలలు 92, ఇరవై మందిలోపు విద్యార్థులున్న ప్రాథమికోన్నత పాఠశాలలు 51 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న బడులను.. సమీప పాఠశాలల్లో విలీనం చేయాలన్న నిర్ణయం తీసుకుంటే ఇవన్నీ మూతపడే ప్రమాదం ఉంది. ఇక 30 విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలు ఒక్కటీ లేకపోవడం శుభపరిణామం. 

తప్పెవరిది? 
వివిధ కారణాల వల్ల ప్రభుత్వ బడుల్లో ఏటేటా ప్రవేశాలు తగ్గిపోతున్నాయి. సర్కారు బడులపై సమాజంలో నమ్మకాన్ని కలిగించడంలో ప్రభుత్వాలు విఫలమవడమూ ఓ కారణం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం, ఇంగ్లిష్‌ మీడియాన్ని అన్ని స్కూళ్లలో పరిచయం చేయకపోవడం, మౌలిక వసతులు కొరత, కనీస సౌకర్యాల లేమి తదితర కారణాల వల్ల ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరమవుతున్నారు. మరోపక్క ప్రైవేటు స్కూళ్లు ఏడాదికేడాది కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతామన్న పాలకుల మాటలే తప్ప.. కార్యరూపం దాల్చడం లేదు. ఈ పరిణామాల తో ప్రభుత్వ బడుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో తక్కువ విద్యార్థులను సమీప బడుల్లో విలీనం చేసి, ఉపాధ్యాయులందరినీ ఆయా బడుల్లో సర్దుబాటు చేయాలన్న దిశగా సర్కారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి చర్యల వల్ల.. ఏళ్లుగా అక్షర జ్ఞానాన్ని పంచిన పాఠశాలలు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. పాఠశాలల బలోపేతం దిశగా చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే విలీనమనే మాటే ఉండేది కాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.  


పది మంది విద్యార్థులలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలలు : 92 
20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు : 51 

తాజాగా వచ్చిన ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. గత నెల 30వ తేదీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని జాబితాను రూపొందించారు. దీని ప్రకారం మొత్తం 143 స్కూళ్లలో  విద్యార్థులు నిర్దిష్ట సంఖ్య కంటే తక్కువగా ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement