కుప్పకూలిన గౌలిగూడ బస్టాండ్‌ | Gowliguda Bus Station Crashed Down In Hyderabad | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన గౌలిగూడ బస్టాండ్‌

Published Thu, Jul 5 2018 3:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Gowliguda Bus Station Crashed Down In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : చారిత్రాత్మక గౌలిగూడ బస్టాండ్‌(సీబీఎస్‌) గురువారం నిలువునా కుప్పకూలింది. ఈ సమయంలో బస్టాండ్‌లో బస్సులు, ప్రయాణీకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోనే మొట్టమొదటి బస్సు డిపో గౌలిగూడ. బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ఇంజినీర్ల సూచన మేరకు జూన్ 30 నుంచి బస్ స్టేషన్‌ను మూసివేశారు.

నాటి నుంచి బస్సులను, ప్రయాణికులను బస్ స్టేషన్‌లోకి అనుమతించడం లేదు. బస్సులు, ప్రయాణికులు లేని సమయంలో బస్ స్టేషన్ కుప్పకూలడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. 88 ఏళ్ల క్రితం ఈ బస్టాండ్‌ను ఏర్పాటు చేశారు. మూసీ నదీ తీరాన అర్ధచంద్రాకారంలో విశాలంగా నిర్మించి ఈ షెడ్డును నిజాం బస్టాండ్‌గా మార్చారు.

1932 జూన్‌లో గౌలిగూడ బస్టాండ్ ప్రారంభమైంది. 30 ప్లాట్‌ ఫారాలతో 27 బస్సులతో గౌలిగూడ హ్యాంగర్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సుల రాకపోకలు కొనసాగాయి. 166 మంది నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు ఉద్యోగులతో సేవలు ప్రారంభమయ్యాయి. 1994 తర్వాత కేవలం లోకల్ బస్సులు ఇక్కడి నుంచి ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.

సందర్శించిన మంత్రి మహేందర్‌ రెడ్డి

కుప్పకూలిన సిటీ బస్టాండ్‌ను తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి సందర్శించారు. బస్టాండ్‌ కూలడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కట్టడం కూలినా ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదం జరలేదని చెప్పారు. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ తన విమాన స్థావరం కోసం దీన్ని ఏర్పాటు చేయించారని వెల్లడించారు.

1930లో అమెరికాకు చెందిన బట్లర్ కంపెనీ దీన్ని తయారు చేసిందని తెలిపారు. దీనికి మిసిసిపి ఏయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్‌గా నామకరణం చేశారని చెప్పారు. కొద్దికాలం తర్వాత నిజాం రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ కింద తొలి డిపోగా ఏర్పాటు చేయించారని వివరించారు. తెలంగాణ చారిత్రక కట్టడాల్లో గౌలిగూడ బస్టాండ్‌ కూడా ఒకటని అన్నారు.

కూలిన కట్టడం స్థానంలో ఆర్టీసీ అదనపు ఆదాయం సాధించడం కోసం వినియోగిస్తామని చెప్పారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement