పెద్దల సభపై.. నజర్
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీ చేసేందుకు ఔత్సాహికులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుత ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్ పదవీ కాల పరిమితి వచ్చే యేడాది మార్చితో ముగియనుండడంతో ఈ స్థానానికి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుండడంతో ఔత్సాహికులు ఇప్పటి నుంచే మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గంపై ఔత్సాహికులు కన్నేశారు. వీరిలో జిల్లాకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ఉండడంతో శాసనమండలి ఎన్నికల వేడి రాజుకుంటోంది. 2007, 2009 లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొ ఫెసర్ కె.నాగేశ్వర్ విజయం సాధించారు. అయితే, ప్రస్తుతం జరగనున్న ఎన్నికలో నాగేశ్వర్ మరోమారు పోటీ చేస్తారా లేదా అనే అంశంపై స్పష్టత కొరవడింది.
వరంగల్,నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి నాగేశ్వర్ పోటీ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఓటరు నమోదు కార్యక్రమానికి ముందే బీజేపీ అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో డాక్టర్ నాగేశ్వర్‌పై పోటీ చేసి ఓటమి పాలైన ఎన్.రామచందర్‌రావు పేరును బీజేపీ ప్రకటించింది. నల్లగొండ జి ల్లా కోదాడకు చెందిన రాంచందర్‌రావు 2014 ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి కూడా పట్టభద్రల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపినా నాయకత్వం మా త్రం రాంచందర్‌రావు వైపు మొగ్గు చూపింది. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు కుదుర్చుకుని పోటీచేసిన బీజేపీ ప్రస్తుతం ఒంటరిగానే బరిలోకి దిగుతుండడంపై టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఉపాధ్యాయ సంఘం నేతల ఆసక్తి
పీఆర్‌టీయూ, టీపీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులిద్దరూ ఇదే స్థానం నుంచి పోటీకి సన్నద్ధం అవుతుండటంతో టీఆర్‌ఎస్‌లో టికెట్ కోసం పోటీ నెలకొంది. పీఆర్‌టీయూకు చెందిన ఎమ్మెల్సీలు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరడంతో పాటు పట్టభద్రుల నియోజకవర్గంలో తమ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నారు. ఈ మేరకు వెంకట్‌రెడ్డికి అనుకూలంగా యూనియన్ ఇప్పటికే తీర్మాణనం చేసింది. వచ్చేయేడాది ఉపాధ్యాయ వృత్తి నుంచి రిటైర్ అవుతున్న వెంకట్‌రెడ్డి ఇప్పటికే టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర ముఖ్య నేతలను కలిసి తన మనోగతం వెల్లడించినట్లు సమాచారం.
టీపీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్దన్‌రెడ్డి కూడా టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి సహకారం, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం వంటి అంశాలు తనకు ఉపకరిస్తాయని హర్షవర్దన్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా, విద్యా సంస్థలతో ఉన్న సన్నిహిత సంబంధాలు ఉపకరిస్తాయనే కోణంలో తన అభ్యర్థిత్వంపై లెక్కలు వేసుకుంటున్నారు. ఇద్దరు నేతలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారే కావడం, ఉపాధ్యాయ సంఘాల్లో రాష్ట్ర పదవుల్లో ఉండటం కలిసి వస్తుందనే భావనలో ఉన్నారు.
స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి..
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతగా,తెలంగాణ ఉద్యమంలో వివిధ సంఘా లతో కలిసి పనిచేసిన సుభాష్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలంగాణ విద్యార్థి యువజన సంఘం, తెలంగాణ ప్రైవేటు లెక్చరర్ల ఫోరం ఏర్పాటులో సుభాష్‌రెడ్డి కీలక పాత్ర పోషించారు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్లకు చెందిన సుభాష్‌రెడ్డి విద్యార్థి సంఘం నేతగా తనకున్న విస్తృత పరిచయాలు కలిసి వస్తాయనే అంచనాలో ఉన్నారు. కాగా కాంగ్రెస్, టీడీపీ తరఫున పట్టభద్రుల స్థానం నుంచి పోటీ చేస్తామంటూ ఇప్పటివరకు ఎవరూ ప్రకటించిన దాఖలా లేవు. మండలి ఎన్నిక విషయంలో ఆయా పార్టీల వైఖరి ఎలా ఉంటుందనే అంశంపై పార్టీ కేడర్‌కు కూడా స్పష్టత లేకుండా పోయింది.
ఓటరు నమోదుకు సన్నాహాలు
2009 ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గంలో 2.14 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. గతంలో నమోదైన ఓటర్లు ఈ నెల 25వ తేదీలోగా ఫొటోలు అందజేయాల్సిందిగా ఎన్నికల సంఘం సూచించింది. ఈ నెల 25 నుంచి డిసెంబర్ 16 వరకు నూతన ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తారు. 2015 జనవరిలో తుది జాబితా ప్రకటిస్తామని అధికారులు ప్రకటించారు.