పార్టీల్లో 'స్థానిక' కలకలం
♦ రసవత్తరంగా మారుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల చిత్రం
♦ ఎంపీటీసీల ఆత్మగౌరవ పోరాటంతో అధికారపక్షంలో అలజడి
♦ టీఆర్‌ఎస్‌తో ‘అవగాహన’పై కాంగ్రెస్‌లో గందరగోళం
♦ అభ్యర్థులే దొరకని పరిస్థితిలో టీడీపీ
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఓ వైపు పార్టీ ఫిరాయింపులు, మరోవైపు ఎంపీటీసీల ఆత్మగౌరవ పోరాటం, ఇంకోవైపు స్థానిక సంస్థల ప్రతినిధులకు పార్టీల తాయిలాలతో ‘స్థానిక’ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలకలం రేపుతున్నాయి. తమకు బలమున్న చోట కూడా గెలుస్తామో లేదోనన్న ఆందోళనలో అధికార పక్షంతో అవగాహనకు కాంగ్రెస్ తహతహలాడుతోంది. మహబూబ్‌నగర్ మినహా మరెక్కడా పోటీ చేసేందుకు టీడీపీకి అభ్యర్థులే దొరకడం లేదు. దక్షిణ తెలంగాణలో మూడు నియోజకవర్గాలు మినహా కాంగ్రెస్‌దీ అదే పరిస్థితి. అటు ఖమ్మం లో సీపీఐకి మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయించిం ది. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా సీపీఐకి మద్దతు పలకాలని కాంగ్రెస్ స్థానిక నాయకత్వం యోచిస్తోంది. ఖమ్మంలో గుండుగుత్తగా మద్దతిస్తే తప్ప అవగాహన ఉం డదని టీఆర్‌ఎస్ మధ్యవర్తులు ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్యులకు స్పష్టం చేశారు.
కాంగ్రెస్ 'అవగాహన' పై విమర్శలు
వరంగల్ లోక్‌సభ ఉపఎన్నికలో డిపాజిట్ కో ల్పోయి ఘోర పరాజయం చవిచూసిన కాం గ్రెస్... 'స్థానిక' ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార పార్టీతో అవగాహనకు ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇవి కాంగ్రెస్ పూర్తిగా భ్రష్టు పట్టడానికి కారణమవుతున్నాయంటూ పార్టీలోని మెజారిటీ నేతలు మండిపడుతున్నా రు. ఒకరిద్దరు మండలి ఎన్నికల్లో సులువుగా విజయం సాధించడం కోసం, మరో ముఖ్య నేత తన చిరకాల ప్రత్యర్థి (టీఆర్‌ఎస్ మండలి సీటు కోరుతున్న నేత)ని దెబ్బ తీయడం కోస మే ‘అవగాహన’ తెరపైకి వచ్చిందని మాజీ మంత్రి ఒకరు మండిపడుతున్నారు. వరంగల్ పరాజయం తరువాతైనా ముఖ్య నేతలు మార లేదని, వీరి ద్వారా పార్టీకి భవిష్యత్ ఉండదనేది ఓ సీనియర్ ఎమ్మెల్యే ఆవేదన. గురువారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చించినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌తో అవగాహన కుదుర్చుకున్నా ఖమ్మంలో తమ మద్దతు సీపీఐకే ఉం టుందని ఆ జిల్లా ముఖ్య నేత ఒకరు చెప్పినట్టు సమాచారం.
అభ్యర్థులే కరువు
తమకు మెజారిటీ ఉన్న నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తప్ప మిగతా చోట్ల కాంగ్రెస్ పార్టీకి, మహబూబ్‌నగర్ మినహా మిగతా చోట్ల టీడీపీకి అభ్యర్థులు దొరకట్లేదు. కొందరు పోటీకి ముందుకొస్తున్నా పార్టీ నుంచి ఆర్థిక వనరులుంటేనే రంగంలోకి దిగుతామని స్పష్టం చేస్తున్నారు. ఇక టీడీపీ నాయకత్వం తీరు చూస్తుంటే... జిల్లాల్లో ఆ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా వలసలు అరికట్టే ప్రయత్నమే చేయడం లేదు. మహబూబ్‌నగర్ నుంచి మాత్రం కొత్తకోట దయాకర్‌రెడ్డి పోటీ దాదాపుగా ఖాయమైంది. కాంగ్రెస్ విషయానికొస్తే నల్లగొండలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక విడత ప్రచారం కూడా పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌లో రెండు సీట్లకు పోటీ చేయాలని డీకే అరుణ పట్టుపడుతుండగా... అవగాహనలో ఒకటి టీఆర్‌ఎస్‌కు ఇవ్వాలని పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు.
ఎంపీటీసీల ఆత్మగౌరవ నినాదం..
ప్రభుత్వం తమకు అధికారాలు అప్పగించడం లేదని ఎంపీటీసీలు కొంత కాలంగా రగిలిపోతున్నారు. ఈ ఎన్నికల్లో తమ ప్రతినిధులను తామే ఎన్నుకుంటామంటూ ఎంపీటీసీల ఫో రం 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇది అధికార టీఆర్‌ఎస్‌కు ఇరకాటం తెచ్చిపెట్టడంతో వారిని పోటీ నుంచి తప్పించే మార్గాన్ని సీఎం కేసీఆర్ అన్వేషిస్తున్నారు. ఎంపీటీసీల ఫోరం గౌరవాధ్యక్షుడిగా ఉన్న ఆర్థిక మంత్రి ఈటలకు ఈ బాధ్యత అప్పగించినట్లు సమాచారం. వారి డిమాండ్లలో కొన్నింటిని నెరవేరుస్తామని మంత్రి హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అప్పటికీ వారు వెనక్కితగ్గకపోతే గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ఈటల హెచ్చరించినట్లు సమాచారం.