గుత్తాకు టీఆర్ఎస్ లైన్ క్లియర్!
ఆ జిల్లా గులాబీ నేతల అభిప్రాయం తీసుకున్న కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు అంతా సిద్ధమైపోయింది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డితోపాటు మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్.భాస్కర్‌రావు, మరికొందరు స్థానిక ప్రజా ప్రతిని ధులను టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ ముఖ్య నేతలతో చర్చించారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి చేరికపై వారికి స్పష్టత ఇచ్చి, వారి అభిప్రాయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి, భాస్కర్‌రావు, ఇతర నేతల చేరికకు టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, ప్రజా ప్రతినిధులు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రతిపాదనను కేసీఆర్ నిరాకరించినట్టుగా తెలిసింది. అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ పలువురు ఎంపీలు పార్టీ మారినా అనర్హత వేటు పడలేదని ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు సమాచారం. అనర్హత వేటు పడే అవకాశముంటే అప్పుడే రాజీనామా గురించి ఆలోచించవచ్చని, అప్పటిదాకా రాజీనామా అవసరం లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే గుత్తా చేరికకు తేదీని ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు ఒకవేళ ఎంపీ పదవికి గుత్తా రాజీనామా చేస్తే నల్లగొండ ఎంపీ స్థానంలో తేరా చిన్నపరెడ్డికి అవకాశమివ్వాలనే ప్రతిపాదనపైనా కేసీఆర్ చర్చించినట్టు తెలిసింది.