ఆ ఇద్దరివైపే అందరి చూపు
హరీశ్‌రావు, కేటీఆర్ పాత్రపై ఆసక్తి ఎలాంటి పోర్టుఫోలియోలు ఇస్తారనేదానిపై చర్చ
మంత్రివర్గంలో ఆ ఇద్దరూ ఉంటారా?
ఒకరికి పార్టీ పగ్గాలు, మరొకరికి కేబినెట్ మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు
ఇద్దరికీ సమ ప్రాధాన్యం లభిస్తుందంటున్న టీఆర్‌ఎస్ వర్గాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఏర్పాటు కాబోయే తొలి మంత్రివర్గంలో ఇద్దరు ముఖ్యులు నిర్వహించబోయే పాత్రపై అత్యంత ఆసక్తి వ్యక్తమవుతోంది. తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ వర్గాల్లో సైతం ఈ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు.. వారికి అప్పగించే బాధ్యత ఏమిటి? అవి ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయి? అనే అంశాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇందులో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారక రామారావు ఒకరుకాగా.. ఆయన మేనల్లుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మరొకరు. మంత్రివర్గంలో ఈ ఇద్దరూ ఉంటే పోర్టు ఫోలియోల్లో ఎవరికి ప్రాధాన్యం లభిస్తుంది? ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉన్న శాఖలనే కేసీఆర్ అప్పగిస్తారా? అని అన్ని వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఇద్దరూ.. ఇద్దరే..
టీఆర్‌ఎస్‌లో ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్లా? అంటూ 2009లో అనేక విమర్శలు వచ్చాయి. 2009లో దీక్ష, డిసెంబరు 9 ప్రకటన తర్వాత అలాంటి చర్చే లేకుండా చేయడంలో హరీశ్, కేటీఆర్ ఇద్దరూ సఫలీకృతులయ్యారు. ఉద్యమ కార్యక్రమాలు, పార్టీలో సంక్షోభం, ఇతర ముఖ్యమైన చేరికలు, విమర్శలను తిప్పికొట్టడం వంటి అంశాల్లో ఇద్దరూ సమర్థంగా వ్యవహరించారు. సాగునీరు, విద్యుత్, రెవెన్యూ, ఉద్యోగ, కార్మిక సమస్యలు వంటివాటిపై పోరాటంలో హరీశ్‌రావు ముందున్నారు. పార్టీకి సంక్షోభ సమయంలో ట్రబుల్ షూటర్‌గా హరీశ్ వ్యవహరిస్తున్నారు. ఇక వ్యవసాయం, పారిశ్రామిక, చేనేత, పవర్‌లూమ్ సమస్యలపై పోరాటంలో కేటీఆర్ క్రియాశీలంగా ఉన్నారు. పార్టీలోకి ముఖ్యమైన నాయకులను తీసుకురావడంతో పాటు కేసీఆర్‌కు అతి ముఖ్యమైన అన్ని పనుల్లో కేటీఆర్ కీలకంగా పనిచేస్తున్నారు. విషయ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ వంటివాటితో జాతీయ వ్యవహారాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. 2009 నవంబరు నుండి 2014లో తెలంగాణ బిల్లు పాసయ్యేదాకా జరిగిన అనేక నిరసన కార్యక్రమాలకు సంబంధించి ఇద్దరిపైనా పలు కేసులు నమోదయ్యాయి. పార్టీలోని అన్ని స్థాయిల్లో సమస్యల పరిష్కారంతో పాటు వివిధ పార్టీల నేతలతో సంబంధాల విషయంలోనూ వారు క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు.
ఇద్దరికీ అవకాశం..?
తెలంగాణ రాష్ట్ర తొలి కేబినెట్‌లో హరీశ్, కేటీఆర్ ఇద్దరికీ స్థానం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండే నాయకులు, పార్టీ ముఖ్యులు చెబుతున్న దాని ప్రకారం ఇద్దరికీ ప్రాధాన్యమైన శాఖలే దక్కుతాయి. అయితే కేసీఆర్ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు, మనసులోని మాటను స్పష్టంగా వెల్లడించలేదు. ఇప్పటిదాకా కేసీఆర్ పార్టీ ముఖ్యులు, సన్నిహితులతో మాత్రమే కేబినెట్‌లో ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపై స్థూలంగా చర్చించారు. దాని ప్రకారమే మంత్రివర్గంలో ఎవరుంటారనే అంచనాలు వస్తున్నాయి. తెలంగాణ మంత్రివర్గంలో స్థానం ఉంటుందని కొందరి పేర్లను కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అలాంటివారు తమకు నచ్చిన పోర్టు ఫోలియో కోసం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసుకుంటున్నారు. కేటీఆర్, హరీశ్‌లకు స్థానంపై ఎక్కడా బయటపడలేదు. తెలంగాణలో గరిష్టంగా 18 మందికి మాత్రమే కేబినెట్‌లో అవకాశముంది. అయితే ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశం ఇస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం కుటుంబసభ్యులనే ముద్ర సమర్థులైనవారికి అవరోధంగా మారాలా? అని పేర్కొంటున్నారు. ఇలాంటి చర్చలు ఎలా ఉన్నా వారిద్దరూ లేకుండా మంత్రివర్గం ఉంటుందా? అన్న అనుమానాలను కేసీఆర్ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు. ఒక దశలో కేటీఆర్‌కు పార్టీపగ్గాలు అప్పగించి, పూర్తిగా పార్టీని బలోపేతం చేసే పని అప్పగిస్తారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ఫలితాల అనంత రం తొలిసారిగా గవ ర్నర్ వద్దకు వెళ్లిన టీఆర్‌ఎస్ బృందంలో హరీశ్ లేకపోవడం రాజకీయువర్గాల్లో రకరకాల చర్చకు తావిచ్చింది. ఐతే పార్టీవర్గాలు వూత్రం ఇద్దరికీ సవుప్రాధాన్యం దక్కుతుందనీ, మిగతావన్నీ అనవసర ప్రచారాలేనని కొట్టిపారేస్తున్నారు.