
నగరంలో భారీ బందోబస్తు
చార్మినార్/అత్తాపూర్ : నగరంలోని పాతబస్తీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు శుక్రవారం ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన తీవ్రవాదుల అంత్యక్రియల నేపథ్యంలో చిన్నచిన్న అవాంఛనీయ సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు శుక్రవారం ప్రార్థనలను దృష్టిలో పెట్టుకొని చార్మినార్, మక్కామసీద్ ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పాతబస్తీలో పరిస్థితులను పర్యవేక్షించారు.
ఆయనతో పాటు అడిషినల్ సీపీ అంజన్‌కుమార్, సౌత్‌జోన్ డీసీపీ సత్యనారాయణ ఉన్నారు. అదేవిధంగా అత్తాపూర్ లో పోలీసులు ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ పోలీసులు అత్తాపూర్‌లోని గురుద్వారా జండా వద్ద భారీ బలగాలు మోహరించాయి.