
సాక్షి, సిటీబ్యూరో: నగరానికే తలమానికమైన ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)ను టోల్ ఆపరేట్ ట్రాన్స్‌ఫర్ (టీఓటీ) పద్ధతిన ఏక కాలంలో 30ఏళ్ల పాటు ఏదైనా సంస్థకు లీజుకు ఇస్తే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు రూ.4,500 కోట్ల ఆదాయం వస్తుంది. వీటిని ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, సిటీలో ట్రాఫిక్ నియంత్రణకుస్కైవేల నిర్మాణం చేపట్టొచ్చు. అదే విధంగా ఓఆర్‌ఆర్ టోల్ నిర్వహణ, రహదారుల మరమ్మతులు, ఐదేళ్లకోసారి బీటీ రోడ్ల నిర్మాణం తదితర పనులన్నీ ఈ టెండర్ దక్కించుకున్న సంస్థనే 30ఏళ్ల పాటు పర్యవేక్షించే అవకాశం ఉంది. దీంతో హెచ్‌ఎండీఏకు నిర్వహణ భారం కూడా తొలగిపోతుంది. ఈ మేరకు టీఓటీ పద్ధతిపై దాదాపు ఏడాదిగా హెచ్‌ఎండీఏ చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. టీఓటీపై ఆర్థిక, న్యాయ విభాగం అధికారులకు ఉన్న సందేహాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ అధ్యక్షతన హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సమక్షంలో సోమవారం జరిగిన భేటీలో నివృత్తి చేశారు.
ఈ నేపథ్యంలో ఇక ఈ పనుల్లో పురోగతి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వ ఆమోదం లభిస్తే టీఓటీ టెండర్లు పిలిచేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది. ఆ తర్వాత పనులు పట్టాలెక్కడమే తర్వాయని అధికారులు చెబుతున్నారు. ఓఆర్‌ఆర్ టోల్, రోడ్ల నిర్వహణకు 30 ఏళ్ల పాటు టీఓటీ పద్ధతిన టెండర్ పిలవడం వలన కోట్ చేసే రూ.4,500 కోట్ల కన్నా ఎక్కువకే సంస్థలు దక్కించుకునే అవకాశముందని పేర్కొంటున్నారు. ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) టీఓటీ పద్ధతిలో ఆంధ్రప్రదేశ్‌లో రెండు, గుజరాత్‌లో నాలుగు నేషనల్ హైవేలకు రూ.6వేల కోట్ల అంచనాతో టెండర్‌కు వెళ్లగా రూ.9వేల కోట్లు వచ్చాయని ఉదహరిస్తున్నారు. ఆ నిధులను ఎన్‌హెచ్‌ఏఐ జాతీయ రహదారుల నిర్మాణంపై ఖర్చు చేస్తోందన్నారు.
మేలోనే నివేదిక...
ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ను రోజూ లక్ష మంది వాహనదారులు వినియోగించుకుంటున్నారు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్, వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని హైవే ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను హెచ్‌ఎండీఏ అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే స్మార్ట్ కార్డులు, టచ్ అండ్ గో కార్డులు, ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డుల వినియోగంతో వాహనదారుల జర్నీ సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే ఇవి పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. టెక్నాలజీ పరంగా కొత్తపుంతలు తొక్కుతూ, భవిష్యత్‌లో వాహనాల సంఖ్య పెరిగినా ఇబ్బంది లేకుండా హెచ్‌ఎండీఏ చర్యలు తీసుకుంటోంది. అయితే ఓఆర్‌ఆర్‌ను టీఓటీ పద్ధతిలో 30 ఏళ్లు లీజుకివ్వడంపై హెచ్‌ఎండీఏ ఫిబ్రవరిలో నియమించిన ట్రాన్జాక్షన్ అడ్వైజర్లు (లావాదేవీల సలహాదారులు) లీ అసోసియేట్స్ సౌత్ ఆసియా, క్రిసిల్ అధ్యయనం చేసి మేలో నివేదిక సమర్పించింది. భవిష్యత్‌లో ఓఆర్‌ఆర్ వినియోగం, ట్రాఫిక్ పెరుగుదల, టోల్ పెంపులన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రస్తుత విలువను అంచనా వేసి రూ.4,500 కోట్లకు టెండర్‌కు వెళ్లొచ్చని పేర్కొంది. అయితే ఈ నివేదిక జూన్‌లోనే ప్రభుత్వ స్థాయికి వెళ్లినా ఆయా శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ వేసినా గొంగళి అక్కడే అన్నట్టుగా మారింది. ఈ విషయాన్ని హెచ్‌ఎండీఏ కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన జనార్దన్‌రెడ్డి... మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సందేహాలున్న ఆర్థిక, న్యాయ విభాగాల అధికారులతో సెక్రటేరియట్‌లో సోమవారం సమావేశం నిర్వహించి నివృత్తి చేశారు.
‘మహా’ అభివృద్ధి...
టీఓటీ పద్ధతిలో ఓఆర్‌ఆర్ నిర్వహణకు సమకూరే నిధులతో హెచ్‌ఎండీఏ మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనుంది. ముఖ్యంగా ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా రెండు కిలోమీటర్ల పరిధిలోనున్న గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఓఆర్‌ఆర్ రోడ్డును కలుపుతూ నిర్మిస్తున్న 35 రేడియల్ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. ప్యారడైజ్ నుంచి లోతుకుంట అల్వాల్ వరకు హెచ్‌ఎండీఏ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న స్కైవే కోసం రూ.1,300 కోట్లు ఉపయోగించే అవకాశముంది. ఇవేకాక మరెన్నో అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టనుంది.
Comments
Please login to add a commentAdd a comment