సదానందా..కరుణ చూపవా..
రైల్వే బడ్జెట్ 2014-15 ప్రజలను ఊరిస్తోంది. ప్రతీసారి ఆశలు రేపి ఉసూరుమనిపిస్తున్న బడ్జెట్.. ఈసారి జిల్లాపై కరుణ చూపుతుందని, రైల్వే మంత్రి సదానందగౌడ కాజీపేటకు న్యాయం చేస్తారని కోటి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అటు ప్రజలు, ఇటు రైల్వే కార్మికులు ఆశలు పెట్టుకున్నారు. కాజీపేట సబ్ డివిజన్ కేంద్రంగా ఉప్పల్, ఆలేరు, చింతల్‌పల్లి తదితర స్టేషన్లతోపాటు ఆన్‌లైన్‌లో పనిచేస్తున్న రైల్వే కార్మికులకు కాజీపేట రైల్వే ఆస్పత్రి పెద్దదిక్కుగా ఉంది. ఈ ఆస్పత్రిలో ప్రతిరోజూ 300-400 వరకు ఓపీ ఉంటుంది.
రైల్వే కార్మిక కుటుంబాలకు ఇక్కడ నాణ్యమైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. సరైన సమయంలో రెఫరల్ ఆస్పత్రులు లేకపోవడంతో దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి, అత్యవసర చికిత్స కావల్సిన వారికి వైద్యం అందడం లేదు. కాజీపేట రైల్వే ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దీనికి సంబంధించిన కీలక ఫైల్ రైల్వేబోర్డులో పెండింగ్‌లో ఉంది. రైల్వే బడ్జెట్‌లో ఈసారైనా దీనికి మోక్షం లభించి, అప్‌గ్రేడ్ హోదా దక్కితే కార్మిక కుటుంబాలకు అన్ని విధాలా నాణ్యమైన వైద్యం అందుతుంది.
జిల్లావాసుల చూపంతా ఇప్పుడు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌పైనే ఉంది. కాజీపేటపై పెట్టుకున్న ఆశలు ఈ బడ్జెట్‌లోనైనా సాకారమవుతాయని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏళ్లుగా వెక్కిరిస్తున్న సమస్యలు, రైల్వే కార్మికుల డిమాండ్లు, రైల్వే ఆస్పత్రి అప్‌గ్రేడ్, అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు, ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌లో సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టాలన్న డిమాండ్లకు ఈ బడ్జెట్‌లోనైనా పరిష్కారం లభిస్తుందని కొండంత ఆశగా ఉన్నారు.
- కాజీపేట రూరల్
రైల్వే స్కూల్‌లో సెంట్రల్ సిలబస్
కాజీపేట రైల్వే ఇంగ్లిష్ మీడియం హైస్కూల్‌ను శతాబ్దం క్రితం నిజాం రైల్వే కంపెనీ లిమిటెడ్ కాలంలో నిర్మించారు. జిల్లాలో మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌గా పేరుగాంచిన ఈ పాఠశాల ఐదేళ్ల క్రితం వరకు ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఈ స్కూల్ దయనీయ స్థితిలో ఉంది. విద్యార్థులు లేక వెలవెలబోతోంది. ఇందులో సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టి రైల్వే కార్మికుల పిల్లలతోపాటు బయటి వారిని కూడా చేర్చుకుంటే ఈ స్కూల్‌కు పునర్‌వైభవం వస్తుందని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్
కాజీపేటలో అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా ఎలక్ట్రిక్ లోకోషెడ్, డీజిల్ లోకోషెడ్‌లలో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా అప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇందుకు ఈ రెండు లోకోషెడ్లు అనువుగా ఉన్నాయి. ఈ సెంటర్ ఏర్పాటైతే పది, ఇంటర్ మీడియట్ చదివిన వారు అందులో అంప్రెంటిస్ చేసే అవకాశం ఉంటుంది.
వీరికి ఏడాది, రెండేళ్ల శిక్షణ కోర్సు ఉంటుంది. శిక్షణ కాలంలో వారికి స్టయిఫండ్ వచ్చి వారితో పనిచేయించుకునే అవకాశం ఉంది. తర్వాత షెడ్లలో ఏర్పడిన ఖాళీలను బట్టి అప్రెంటిస్ కోట కింద శిక్షణ పూర్తిచేసుకున్న వారికి ఉద్యోగాలు లభిస్తాయి. కాబట్టి కాజీపేటలో అంప్రెంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలంటూ చాలా ఏళ్లుగా డిమాండ్ ఉంది. ప్రతీ బడ్జెట్‌లోనూ నిరాశే ఎదురవుతోంది. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా ఈ కల నెరవే రుతుందని ఈ ప్రాంతవాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. వారి ఆశలు నెరవేరుతాయో లేదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.