సర్వే.. సిద్ధం
సాక్షిప్రతినిధి, నల్లగొండ :సమగ్ర కుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. మంగళవారం ఉదయం 8గంటల నుంచే జిల్లావ్యాప్తంగా సర్వే మొదలుకానుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు తమతమ సొంత ఊళ్లకు చేరుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉపాధి కోసం వెళ్లిన కుటుంబాలు సైతం పల్లెలకు చేరుకున్నాయి. దీంతో చాన్నాళ్లుగా కలుసుకోని బంధుమిత్రులు సర్వే వల్ల ఒక్కచోటుకు చేరుతున్నారు. ఆర్టీసీ కార్మికులకూ సెలవు ప్రకటించినా, కొన్ని బస్సు సర్వీసులనైనా నడపాలని ఆర్టీసీ అధికారులను కోరినట్లు కలెక్టర్ చిరంజీవులు తెలిపారు. సర్వే సిబ్బంది అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని సర్వీసులను నడిపే వీలుంది.
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి కుటుంబ వివరాలు సేకరించేందుకు వచ్చే ఎన్యుమరేటర్లు తమ తమ ఇళ్లకు వచ్చే దాకా ఎదురుచూడాల్సి ఉంటుంది. సూర్యాపేట, నల్లగొండ డివిజన్‌లో ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నందున సర్వే రాత్రి దాకా సాగే అవకాశం ఉంది. సర్వేను విజయవంతం చేసేందుకు, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ముగించేందుకు అధికారుల మోహరింపు కూడా జరిగింది. మండలానికి ఒక ప్రత్యేక అధికారి, క్లస్టర్, జోనల్, నోడల్ అధికారులు ఇలా, బాధ్యతలను విభజించారు. పర్యవేక్షణ సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రజల్లో ఉన్న అనేక సందేహాలను తొలగించేందుకు శ్రమించిన అధికార యంత్రాంగం చివరిది, అసలైన అంకమైన సర్వే ను కూడా దిగ్విజయంగా పూర్తి చేసేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది.