
సరిగ్గా వందేళ్ల కింద (1917 నవంబర్ 30న) కాగితపు కరెన్సీలో అతి తక్కువ విలువ కలిగిన రూపాయి నోటును అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మాత్రమే దీన్ని ప్రవేశపెట్టారు. అంటే మన రూపాయి నోటుకు వందేళ్లు నిండాయన్న మాట. తొలుత నోటును ముద్రించినపుడు ఒక్క రూపాయికి 10 గ్రాముల వెండి నాణెం విలువ ఉండేది. ప్రస్తుతం 10 గ్రాముల వెండి రూ.390. వందేళ్లలో రూపాయి విలువ 400 పర్యాయాలు పడిపోయింది. 1861 నుంచే వేరే కరెన్సీ నోట్లను విడుదల చేస్తున్నా మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా ఆయుధాల విడిభాగాల తయారీకి రూపాయి వెండి నాణేలను కరిగించడంతో రూపాయి నోట్లను ముద్రించాల్సి వచ్చింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్
ఆసక్తికరమైన పలు అంశాలు...
♦ అప్పటి బ్రిటిష్ రాజు కింగ్ జార్జి–5 బొమ్మతో ఇంగ్లండ్‌లో ముద్రించి ఇక్కడ విడుదల చేశారు. 1926లో దాన్ని ఉపసంహరించారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా కింగ్‌జార్జి–6 బొమ్మతో మళ్లీ ప్రవేశ పెట్టారు.
♦ 1917 నవంబర్ 30న విడుదల చేసినపుడు ‘నేను ఈ మొత్తం చెల్లించడానికి వాగ్దానం చేస్తున్నాను’అని ముద్రించారు. దీనిపై ముగ్గురు బ్రిటిష్ ఆర్థిక శాఖ కార్యదర్శుల సంతకాలున్నాయి. ఇతర పెద్దనోట్లపై మాత్రం ‘ఈ నోటు కలిగిన వారికి ఫలానా మొత్తం ఇచ్చేందుకు నేను హామీ ఇస్తున్నాను’అని ఉంటుంది.
♦ ఉస్మానియా, హైదరాబాద్ రాష్ట్రంలో రూపాయి నోటును 1919, 1943, 1946లలో విడుదలచేశారు.
♦ 1945లో ఈ రూపాయి నోట్లను బర్మాలో కూడా ఉపయోగించేలా సైనికులకు వాటిపై ఎర్రటిముద్రతో పంపిణీచేశారు.
♦ ఫ్రెంచ్ కాలనీల కోసం ఫ్రాన్స్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండో చైనా, తమ కాలనీల కోసం పోర్చుగీస్ ప్రభుత్వం ఫ్రెంచ్ ఇండియన్ రూపాయి, పోర్చుగీస్ ఇండియ న్ రూపియాని విడుదల చేశాయి.
♦ 1948 నుంచి 60 రకాల నోట్లు, విభిన్న సీరియల్ నంబర్లు, వాటిని జారీ చేసిన సంవత్సరాలను ముద్రించి విడుదల చేశారు.
♦ స్వతంత్ర దేశంగా ఏర్పడ్డాక గతంలోని నోటు కంటే భిన్నమైన సైజు, రంగుతో ‘ఒక రూపాయి’అని ముద్రించారు. తెలుగు సహా 8 భాషల్లో వెలువడగా, మలయాళాన్ని మినహాయించి 1956లో కేరళ ఏర్పడ్డాక మళ్లీ జతచేశారు.
♦ 1949లో 4 సింహాలు, అశోక చక్రం బొమ్మలతో కొత్త డిజైన్‌ను ప్రవేశపెట్టారు.
♦ అప్పటి ఆర్థిక శాఖ కార్యద ర్శి కేఆర్‌కే మీనన్ సంతకంతో వెలువడ్డ కొత్త డిజైన్ నోట్లు పాకిస్తాన్‌లోనూ చెలామణి కాగా 1949లో రద్దు చేశారు.
♦ భారత్ గణతంత్ర దేశంగా మారిన తర్వాత విడుదల చేసిన అన్ని ఒక్క రూపాయి నోట్లపై దేశ ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకాలు ఉండగా, మిగతా అన్ని కరెన్సీ నోట్లపై ఆర్‌బీఐ గవర్నర్ సంతకాలున్నాయి.
♦ రూపాయి నోటుపై మాత్రమే భారత ప్రభుత్వం అని ముద్రిస్తుండగా, మిగతా కరెన్సీ నోట్లపై భారతీయ రిజర్వ్‌బ్యాంక్ అని ముద్రించి ఉంటుంది.
♦ 1969లో గాంధీజీ శతజయంతి సందర్భంగా ఆయ న బొమ్మతో ఉన్న రూపాయి నోటు విడుదలైంది.
♦ ఉత్పత్తి ఖర్చు బాగా పెరగడంతో 1995లో రూపాయి డిజైన్‌ను ఉపసంహరించారు. 2016లో పునర్ ముద్రణను ఆర్‌బీఐ మొదలుపెట్టింది.
♦ 2017లో కొత్త టెలిస్కోపిక్ సిరీస్‌తో రూపాయి నోటును ప్రవేశపెట్టారు.
♦ 1985లో ఎస్.వెంకిటరమణన్ సంతకంతో వెలువడిన ఒక్క రూపాయి నమూనా నోటు 2017 జనవరి 21న క్లాసికల్ నుమిస్మాటిక్స్ గ్యాలరీలో అధికంగా రూ.2.75 లక్షలకు అమ్ముడుపోయింది.
♦ 2015లో ముద్రించిన రూపాయి నమూనా నోటు 2017లో రూ.లక్షన్నరకు విక్రయించారు.
1970 వరకు భారత రూపాయి కరెన్సీని దుబాయ్, బహ్రెయిన్, మస్కట్, ఒమన్ తదితర గల్ఫ్, పర్షియన్ దేశాలు కూడా ఉపయోగించాయి. ఇప్పటివరకు ఈ నోట్లు ఎవరైనా కలిగి ఉంటే ప్రస్తుత పాతనోట్ల సేకరణ మార్కెట్‌లో రూ.20–30 వేలు వచ్చే వీలుంది.
Comments
Please login to add a commentAdd a comment