ఔటర్‌పై జర్నీ ఇక బేఫికర్‌ | Hyderabad Outer Ring Road Journey Special Story | Sakshi
Sakshi News home page

ఔటర్‌పై జర్నీ ఇక బేఫికర్‌

Published Tue, Oct 29 2019 1:52 AM | Last Updated on Tue, Oct 29 2019 1:52 AM

Hyderabad Outer Ring Road Journey Special Story - Sakshi

ఘట్‌కేసర్‌ నుంచి శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు మార్గమధ్యలో వెళ్తున్న కారును వెనక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమా దంలో కారులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరికి స్వల్ప గాయ మైంది. అదే మార్గంలో వెళ్తున్న మరో వాహనదారుడు ఈ ఘటన చూసి పోలీసు లకు సమాచారం అందిం చాలనుకున్నాడు. అయితే సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ సరిగాలేక కనెక్ట్‌ కాలేదు. ఆ వెంటనే అక్కడే మెయిన్‌ క్యారేజ్‌వేపై ఉన్న ఎమర్జెన్సీ కాల్‌బాక్స్‌ ద్వారా చేసిన కాల్‌ వారి ప్రాణాలను నిలుపగలిగింది.

శంషాబాద్‌ విమానాశ్ర యానికి వెళ్లడం కోసం గచ్చిబౌలి నుంచి తన బంధు వులతో కలసి ఓ వ్యక్తి బయలుదేరాడు. తెల్లవారుజామున 4 కావడంతో  ఆ మార్గాన్ని పొగమంచు కప్పేసింది. అతడు ఆ పక్కనే ఉన్న భారీ స్క్రీన్‌ను చూశాడు. అక్కడ ‘మీ వాహన లైట్లు, ఇండికేటర్స్‌ వేసుకొని 40 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ముందుకెళ్లాలి అని డిస్‌ప్లే అవుతోంది. దీంతో సాఫీగా అతడి ప్రయాణం పూర్తయింది.

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు మార్గాన్ని ప్రమాద రహిత రహదారిగా మార్చేందుకు గాను అత్యాధునిక సాంకేతికతలో భాగంగా పలు సేవలను హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా జరుగుతున్న హైవే ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (హెచ్‌టీఎంఎస్‌) సేవలను మరో 2 వారాల్లో వాహనదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే ఎమర్జెన్సీ కాల్‌ బాక్స్‌లు, వెరియబుల్‌ సైన్‌ బోర్డులు, మెటిరోలాజికల్‌ ఎక్విప్‌మెంట్లు, సీసీటీవీ కెమెరాలు, ఆటోమెటిక్‌ ట్రాఫిక్‌ కౌంటర్‌ కమ్‌ కాసిఫయర్స్‌ (ఏటీసీసీ)లు ఏర్పాటు చేశారు. వీటన్నింటిని నానక్‌రామ్‌గూడలోని ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు హెచ్‌ఎండీఏ ఓఆర్‌ఆర్‌ విభాగ అధికారులు అనుసంధానం చేస్తున్నారు.

సైన్‌ స్క్రీన్‌లో సమాచారం..
158 కిలోమీటర్లు ఉన్న ఓఆర్‌ఆర్‌లో 19 ఇంటర్‌ఛేంజ్‌లున్నాయి.ఇంటర్‌ఛేంజ్‌లకు 1.3 కిలోమీటర్ల ముందు రెండు వైపులా వెరియబుల్‌ సైన్‌ స్క్రీన్‌ బోర్డులు 37 ఏర్పాటు చేశారు. అలాగే నేషనల్‌ హైవేతో అనుసంధానమయ్యే మార్గాల్లో 10 సైన్‌ స్క్రీన్‌ బోర్డులు అమర్చారు. మెటిరోలాజికల్‌ సెన్సార్స్, పొగమంచు, వెలుతురు మందగించడం, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు, భారీ వర్షం కురిసినప్పుడు, ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడినప్పుడూ.. ఆయా సందర్భాల్లో వాహనచోదకులను అప్రమత్తం చేసేందుకు ఈ సైన్‌స్క్రీన్‌ బోర్డులపై ఆయా సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తారు.

ఆపదలో బటన్‌ నొక్కితే చాలు..
ఇప్పటివరకు ఓఆర్‌ఆర్‌లో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగి గుర్తించినా ఆయా ప్రాంత్లాలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ సరిగా పనిచేయక కొన్ని నిమిషాల పాటు ఇటు పోలీసులు, అటు అంబులెన్స్‌లకు ప్రయత్నించిన సందర్భా లున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎమర్జెన్సీ కాల్‌ బాక్స్‌ను ప్రతి కి.మీ. కు మెయిన్‌ క్యారేజ్‌వే ఎడమ వైపు, కుడి వైపు ఏర్పాటు చేశారు. వాటిల్లోని బటన్‌ నొక్కితే చాలు ఆటోమేటిక్‌గా హెచ్‌ఎండీఏ ట్రాఫిక్‌ కమాండ్‌ కంట్రోల్‌కు కనెక్ట్‌ అవుతుంది.

ఇంటర్‌ఛేంజ్‌లపై నిఘానేత్రం..
రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించిన 19 ఇంటర్‌ఛేంజ్‌లు అంటే వాహనం ఓఆర్‌ఆర్‌పైకి వచ్చే వద్ద దాదాపు 38 సీసీటీవీ కెమెరాలను బిగించారు. జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాల్లో మరో 3 సీసీటీవీలు అమర్చారు. ఈ ప్రాంతాల్లోని నిఘానేత్రాలు గొడవలు, ప్రమాదాలను పసిగట్టి సమాచారాన్ని చేరవేస్తాయి. ఓఆర్‌ఆర్‌పై ఇప్పటివరకు శామీర్‌పేట, రాజేంద్రనగర్, తుక్కుగూడ, సుల్తాన్‌పూర్‌ ప్రాంతాల్లో ఈ ఆధునిక పరికరాలను అమర్చారు.

పక్కాగా వాహనాల లెక్క
ఓఆర్‌ఆర్‌పై ఎన్ని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయనేది ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ కౌంటర్‌ కమ్‌ క్లాషిఫయర్స్‌ (ఏటీసీసీ) తేల్చనుంది. వీటిని ప్రతి ఇంటర్‌ఛేంజ్‌కు ముందు సైన్‌ స్క్రీన్‌ బోర్డుల మాదిరిగానే 72 ఏర్పాటు చేశారు. ఇవి ఏ రోజుకారోజూ ఎన్ని వాహనాలు ప్రయాణం చేశాయి. ఏ రకమైన వాహనాలు ఉన్నాయనే వాటిని కంట్రోల్‌ సెంటర్‌కు చేరవేస్తుంది. దీనివల్ల టోల్‌ రుసుం వసూళ్లు మరింత పారదర్శకంగా జరగనున్నాయి. అలాగే నగరంలో ఏదైనా నేరం చేసి ఓఆర్‌ఆర్‌ మీదుగా వెళ్లే నిందితులు వాహనాన్ని సులువుగా గుర్తించే అవకాశం ఉంది. 

ఔటర్‌ రింగ్‌ రోడ్డు  -                  158
ఇంటర్‌ ఛేంజ్‌లు   -                    19
సైన్‌స్క్రీన్‌ బోర్డులు-                     47
ఏటీసీసీ పరికరాలు-                    72
ఎమర్జెన్సీకాల్‌ బాక్స్‌ సెంటర్‌లు-   328
సీసీటీవీ కెమెరాలు-                     41
మెటిరోలాజికల్‌ ఎక్విప్‌మెంట్‌ బోర్డులు- 4

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement