- రూ.4.66 కోట్ల పనులు రద్దు
- జాబితాలో 13 ఆర్‌వైఎఫ్‌సీలు
- మాజీ ఎంపీ ప్రతిపాదనలకు చెక్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : వెనుకబడిన జిల్లాలు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఐఏపీ నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా ఎంపిక చేసిన జిల్లాలకు ఏటా రూ.30 కోట్లు విడుదల చేసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, అక్కడి యువత పెడదోవ పట్టకుండా ఉపయుక్తమయ్యే నిర్మాణాత్మక పనులకు ఈ నిధులను వెచ్చించాలి. 2012-13 సంవత్సరం విడుదలైన నిధులతో జిల్లాలోని 23 మండలాల్లో రీడింగ్ రూమ్, జిమ్ సదుపాయముండే రాజీవ్ యూత్ ఫెసిలిటేషన్ సెంటర్లు (ఆర్‌వైఎఫ్‌సీ) నిర్మించాలని ప్రతిపాదించారు. ఒక్కో సెంటర్‌కు రూ.20 లక్షల అంచనా వ్యయంతో రూ.4.60 కోట్లతో పరిపాలనా ఉత్తర్వులు జారీ చేశారు.
నిర్మాణ బాధ్యతలను ఏపీఈడబ్ల్యుడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు అప్పగించారు. కానీ కేటాయించిన నిధులు సరిపోవని ఈ పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రయోగాత్మకంగా బెజ్జంకి మండలంలో ఏపీఈడబ్ల్యుఐడీసీ శాఖాపరంగా మొత్తం రూ.28 లక్షల ఖర్చుతో ఆర్‌వైఎఫ్‌సీ నిర్మాణం పూర్తి చేసింది. అందుకే ఒక్కో ఆర్‌వైఎఫ్‌సీకి రూ.32 లక్షలు కేటాయించేలా అంచనా ప్రతిపాదనలను సవరించాలని కోరుతూ ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్‌కు నివేదించారు.
అదే సమయంలో ఆర్‌వైఎఫ్‌సీలకు అవసరమైనన్ని నిధులు కేటాయించి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గత ఏడాది డిసెంబర్‌లో అప్పటి ఎంపీ పొన్నం ప్రభాకర్ కలెక్టర్‌కు లేఖ రాశారు. ఫిబ్రవరి 4వ తేదీన సమావేశమైన జిల్లా స్థాయి కమిటీ ఈఈ నివేదిక, ఎంపీ లేఖను పరిగణనలోకి తీసుకుంది. 22 ఆర్‌వైఎఫ్‌సీలకు బదులు 13 కేంద్రాలు నిర్మించాలని, ఒక్కో సెంటర్‌కు రూ.32 లక్షలు కేటాయించాలని తీర్మానించింది. ఆ మేరకు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. హుస్నాబాద్, ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి, ముస్తాబాద్, కథలాపూర్, గంగాధర, మేడిపల్లి, మానకొండూర్, హుజూరాబాద్ మండలం చెల్పూరు, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్, చొప్పదండి, జమ్మికుంట మండలం కొత్తపల్లి, గంభీరావుపేట, రామడుగు ఆర్‌వైఎఫ్‌సీల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
వరుసగా వచ్చిన ఎన్నికలు, ఫలితాల వెల్లడి అనంతరం కథ మొదటికొచ్చింది. ఈ 13 మండలాలకు మంజూరు చేసిన ఆర్‌వైఎఫ్‌సీలతో పాటు మహదేవ్‌పూర్ మండలానికి మంజూరైన ప్రభుత్వ ఎస్టీ హాస్టల్, కాటారం లైబ్రరీ కమ్యూనిటీ బిల్డింగ్‌ను రద్దు చేస్తూ మే 21న జిల్లా యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా రూ.4.66 కోట్ల పనులు రద్దు చేసింది. స్థలం సమస్య కారణంగా ఎస్టీ హాస్టల్, కమ్యూనిటీ బిల్డింగ్ నిర్మాణం ప్రారంభానికి నోచుకోలేదని, మిగతా ఆర్‌వైఎఫ్‌సీ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని అందులో ప్రస్తావించింది. ఐఏపీ కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.30 కోట్లలో రూ.20 కోట్లు విడుదలయ్యాయి.
మూడో విడత రూ.10 కోట్లు ఇప్పటివరకు రాలేదు. అవి చేజారిపోయినట్లే. ఇప్పటికే ఐఏపీలో రూ.30.57 కోట్ల అంచనా వ్యయమయ్యే 222 పనులు కలెక్టర్ మంజూరీ చేశారు. నిధులతో పోలిస్తే రూ.10.57 కోట్లు అదనంగా పనులు మంజూరయ్యాయి. దీంతో బిల్లుల చెల్లింపు కష్టమవుతుందని, అందుకే ఇప్పటివరకు ప్రారంభం కాని ఈ పనులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కానీ.. కొత్తగా కొలువు దీరిన టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకే ఈ పనులను జిల్లా యంత్రాంగం రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించిన పనులు చేపడితే వారికే గుర్తింపు వస్తుందని, అందుకే ఈ పనులపై తాజా ప్రజాప్రతినిధులు కన్నెర్ర జేసినట్లు గుప్పుమంది.
ఐఏపీ పనులకు రాజకీయ గ్రహణం
Published Tue, Jun 17 2014 3:53 AM | Last Updated on Mon, Sep 17 2018 4:56 PM
Advertisement