- రంగారెడ్డి జిల్లాలో అక్రమార్కులకు చెక్
- 900 ఎకరాల పంచాయతీ స్థలాల స్వాధీనం
- రాజధాని శివారు ప్రాంతాల్లో అధికారుల స్పెషల్ డ్రైవ్
- 2,700 అక్రమ లేఅవుట్ల గుర్తింపు, కేసులు పెట్టాలని నిర్ణయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పంచాయతీ స్థలాలను కొల్లగొడుతున్న అక్రమార్కులపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కొరడా విదిల్చింది. లేఅవుట్లు/వెంచర్లలో ఆక్రమణకు గురవుతున్న దాదాపు 900 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. రియల్టర్లతో చేతులు కలిపిన ఇంటిదొంగలపై సస్పెన్షన్ వేటు వేయడంతో పాటు కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసింది. దీంతో సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూములు పంచాయతీల పరిధిలోకి వెళ్లాయి. స్థిరాస్తి రంగం ఊపందుకోవడంతో జిల్లాలో అడ్డగోలుగా లేఅవుట్లు పుట్టుకొచ్చాయి. నిబంధనల ప్రకా రం ప్రజా ప్రయోజనాల కోసం లేఅవుట్ విస్తీర్ణంలో పది శాతం స్థలం కేటాయించాలి. ఈ స్థలాన్ని స్థానిక పంచాయతీకి బదలాయించాలి. అయితే రియల్టర్లు ఈ స్థలాలను కూడా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు కూడా కుమ్మక్కుకావడంతో ఖాళీ స్థలాలన్నీ పరాధీనమయ్యాయి. కొన్నిచోట్ల హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కూడా అక్రమార్కులతో చేతులు కలపడం విశేషం. రాజేంద్రనగర్ మండలం పుప్పాల్‌గూడలో 17.36 ఎకరాల విస్తీర్ణంలోని ఒక వెంచర్‌కు అధికారికంగా అనుమతి మంజూరు చేసిన హుడా.. తాజాగా అదే వెంచర్‌లోని ఖాళీ స్థలంలో ప్లాట్ల విక్రయానికీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 8,663.7 చదరపు గజాల జాగా అమ్మకానికి లైన్‌క్లియర్ చేసింది. ఈ విషయాన్ని పసిగట్టిన పంచాయతీ అధికారులు హైకోర్టును ఆశ్రయించడంతో సంబంధిత రిజిస్ట్రేషన్లకు బ్రేక్ పడింది.
అధికారుల స్పెషల్ డ్రైవ్
నగర శివార్లలోని 210 గ్రామాల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన లేఅవుట్లపై స్పెష ల్ డ్రైవ్ చేసిన అధికారులు.. వాటిలో 90 శాతం అనుమతుల్లేనివేనని తేల్చా రు. లేఅవుట్లు చేయాలంటే హెచ్‌ఎండీఏ, డీటీసీపీ(పట్టణ, గ్రామీణ ప్రణాళిక సంచాలకుడు) అనుమతి తప్పనిసరి. అయితే హెచ్ ఎండీఏ మార్గదర్శకాలను పాటించకుండా చాలామంది రియల్టర్లు అనధికార లేఅవుట్లకే మొగ్గు చూపుతున్నారు. నగర శివార్లలో దాదాపు 2,700 అక్రమ వెంచర్లను పంచాయతీరాజ్ శాఖ అధికారులు గుర్తించారు. అనుమతులు పొందిన 300 లేఅవుట్లలోనూ పంచాయతీలకు నిర్దేశించిన 10 శాతం స్థలాలు కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ దాదాపు 20 ఎకరాలను లేఅవుట్‌గా మార్చి విక్రయిం చేం దుకు చేసిన యత్నాలను అధికారులు అడ్డుకున్నారు. ఘట్‌కేసర్ మండలం మేడిపల్లి పంచాయతీ పరిధిలో పార్కు స్థలాన్ని అమ్మకానికి పెట్టిన కార్యదర్శిపై వేటు వేశారు. కబ్జాదారుపై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించారు. ప్రజోపయోగాలకు కేటాయించిన పది శాతం స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా డీపీవో పద్మజారాణి తెలిపారు. కబ్జాలో ఉన్న భూములన్నింటినీ స్వాధీనం చేసుకుంటామన్నారు.