మూలవాగు నుంచి అక్రమంగా తరలిపోతున్న ఇసుక
వేములవాడ అర్బన్: ఇసుకాసురుల పైసాచికానందానికి మూలవాగు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలలో భూగర్భజలాలు అంతరించిపోతున్నాయి. ఇప్పటికే మూలవాగుతోపాటు చుట్టూపక్కల ప్రాంతాలలో చుక్క నీరు కనిపించని పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటికీ మూలవాగులోని ఇసుక ఖాళీ కావడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. వేములవాడ పట్టణంలో దాదాపు 30 ట్రాక్టర్‌లు ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ఇసుకను తరలిస్తున్నారు.
పాతాళంలోకి భూగర్భజలాలు:
ఈ ఏడాది జిల్లాలో సగటు వర్షపాతంలో 21 శాతం లోటు ఉంది. జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 14.25 మీటర్లు లోతులో ఉంది. వర్షాకాలంలో వర్షాలు సాధారణ వర్షపాతం 823.19 మిల్లీమీటర్లుకాగా 646.40 మిల్లీమీటర్లు కురిసింది. వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఈ సంవత్సరం మూలవాగు పారలేదు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని నీటి వనరులు ఎండిపోయాయి. శీతాకాలం ప్రారంభంలోనే భూగర్భజలాల పాతాళంలోకి పోవడంతో అటు అన్నదాతులు.. ఇటు పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. వేములవాడ అర్బన్‌లో 24.72 మీటర్ల అత్యధిక లోతుల్లో నీరు ఉంది.
మూలవాగే ఆధారం...
కోనరావుపేట మండలంలోని కొన్ని గ్రామాలు, వేములవాడ మండలంలోని నాంపల్లి, అయ్యోరుపల్లి, వేములవాడ, జయవరం, తిప్పాపూర్, మల్లారం, హన్మాజీపేట గ్రామాలకు మూలవాగే ఆధారం. ఆయా గ్రామాలలో సాగు, తాగునీరు కోసం మూలవాగుపైనే ఆధారపడతారు.
ఇసుక అనుమతులు..
వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ పనులకు మాత్రమే అధికారులు ఇసుక అనుమతి ఇస్తున్నట్లు చెబుతున్నారు. అది కూడా మిడ్‌మానేరు ముంపునకు గురవుతున్న గ్రామాల్లోని పరిసరాల వాగులో ఇసుకను తీసేందుకే అనుమతి ఇస్తున్నారు. పట్టణంలోని ప్రభుత్వ పనులకు అయితే మంగళవారం, గురువారం, శనివారం మూడు రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇస్తున్నారు. కాంట్రాక్టర్ వర్క్ ఆర్డర్ తెచ్చిన తర్వాత ఒక ట్రాక్టర్ ఇసుక ట్రిప్పునకు రూ.220 డీడీ చెల్లించాలి. అనంతరం వారు తహసీల్దార్ కార్యాలయంలో అనుమతులు పొందాలి. తర్వాతనే ఇసుకను తరలించే అవకాశం ఉంటుంది. కానీ వేములవాడ మూలవాగులో ఎలాంటి అనుమతులు లేకుండానే ఇసుకను ఇష్టారీతిగా తోడేస్తున్నారు.
అక్రమంగా రవాణా చేస్తే చర్యలు...
వేములవాడలోని ప్రభుత్వ పనులకు మాత్రమే ఇసుకను అనుమతి ఇస్తున్నాం. అది కూడా కేటాయించిన రోజు, సమయానికే తరలించాలి. మూలవాగులో ఇసుక తోడేందుకు ఎలాంటి అనుమతి లేదు. అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
-నక్క శ్రీనివాస్ తహసీల్దార్, వేములవాడ
బావుల వద్ద తోడుతున్నారు
మూలవాగులో ఉదయం 4 గంటలకే ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు. వ్యవసాయ బావుల వద్ద కూడా ఇసుకను తోడేస్తున్నారు. ఇదేం పద్ధతి అం టే బెదిరింపులకు దిగుతున్నారు. అధికారులే పట్టించుకోవాలి.
-చిర్రం శేకర్ రైతు గొల్లపల్లి
అడుగంటుతున్న భూగర్భ జలాలు
వర్షాలు సరిగ్గా కురువక మూలవాగులోని వ్యవసా య బావుల్లో నీరు అడుగంటిపోయింది. బావులల్లా నీరు మోటార్ల ద్వారా ఒక్క గంట కూడా పోయడం లేదు. ఏసంగి వ్యవసాయం చేయడం కష్టమే.
-ఎం.మల్లేశం రైతు గొల్లపల్లి
Comments
Please login to add a commentAdd a comment