
బీరు.. జోరు.
మండు వేసవిలో చల్లగా బీరుతాగేందుకు మద్యం ప్రియులు ఎగబడిపోతున్నారు.
వేసవిలో చల్లని కిక్కు
► పెరుగుతున్న బీరు కేసుల అమ్మకాలు
► ఆబ్కారీకి భారీగా ఆదాయం
ఆదిలాబాద్ క్రైం : మండు వేసవిలో చల్లగా బీరుతాగేందుకు మద్యం ప్రియులు ఎగబడిపోతున్నారు. ఫలితంగా జిల్లాలో మద్యం కన్న బీర్ల అమ్మకాల జోరు పెరిగింది. వేసవి వచ్చిందంటే చాలు బీర్లు అమాంతం పొంగిపోతాయి. మిగతా నెలల్లో కంటే 20 శాతం అధికంగా అమ్ముడుపోతున్నాయి. జిల్లాలో 157 మద్యం దుకాణాలు, 22 బార్లు ఉన్నాయి. వీటి ద్వారానే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని బెల్టుషాపుల్లో సైతం మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. సాధారణంగా వేసవిలో శరీర ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని చాలా మంది బీర్లవైపే మొగ్గుచూపుతుంటారు. దీనికితోడు వివాహాలు, శుభకార్యాలు కూడా వేసవిలోనే ఎక్కువగా ఉంటాయి, విందులు, వినోదాల పేరుతో మద్యం విక్రయాలు పెరుగుతాయి. సాయంత్రం అయ్యిందంటే మంచి వాతావరణం చూసుకొని చల్లని కిక్కు కోసం మందు ప్రియులు పరుగులు తీస్తున్నారు.
ఈసారి కిక్కే కిక్కు..
గతేడాది వేసవిలో మార్చి నెల నుంచి బీర్ల అమ్మకాలు పెరిగాయి. కానీ... ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే బీర్ల కేసులు అధికంగా అమ్ముడుపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,47,448 లక్షల కేసులు, మార్చిలో 1,79,633 కేసుల బీర్లను మద్యం వ్యాపారులు విక్రయించారు. ప్రస్తుతం ఈ నెలలో పది రోజుల్లోనే 54,931 వేల కేసుల బీర్లు తాగేశారు. ఏప్రిల్ మాసం పూర్తయ్యాలోగా 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 2015 ఫిబ్రవరిలో 1,07,872 కేసులు, మార్చిలో 1,60,249, ఏప్రిల్‌లో 1,47,784 లక్షలు, మేలో 1,94,516 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. సుమారు 20 నుంచి 30 వేల కేసులు అధికంగా విక్రయిస్తున్నారు. దీనికితోడు జిల్లాలో మద్యం, బీర్ల విక్రయాల ద్వారా ప్రతి ఏడాది సుమారు రూ.600 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. ప్రతినెలా రూ.50 కోట్లకు పైగా ఆదాయం ఉంది. మద్యం, బీర్లు సమానంగా అమ్ముడుపోతాయి. కానీ.. వేసవి కాలంలో మాత్రం బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వేసవి మూడు నెలల్లో బీర్ల ఆదాయం రూ.5 నుంచి రూ.10 కోట్లు అధికంగా రానుంది. ఇక పండుగలు, పెళ్లిళ్లు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో వీటి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది.