
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోడలు, నటుడు రామ్‌చరణ్ భార్య ఉపాసన కామినేని సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. సామాజిక స్పృహ కలిగిన సెలబ్రిటీగా ఆమె నిత్యం వార్తల్లో ఉంటారు. ఇండియన్ టాయిలెట్ సిస్టంలో పలు లోపాలు ఉన్నాయని, ఇవి మోకాళ్ల నొప్పులకు కారణమవుతున్నాయని ప్రచారం జరుగుతున్నా.. అసలు ఈ విధానంతో ఆరోగ్యానికి మేలు చేసే పలు కారణాలు ఉన్నాయని ఆమె చెబుతున్నారు. చెప్పడమేకాదు.. ఇండియన్ టాయిలెట్ స్టైల్ మేలంటూ పలు చిత్రాలు కూడా పోస్టు చేయడం గమనార్హం. ఈ భంగిమ శరీరానికి చక్కటి వ్యాయామమని వెల్లడించారు.
రోజూ ఐదు నిమిషాలు ఇలా కూర్చోవడం వల్ల కాళ్ల ఎముకలు గట్టిపడతాయని, శరీరంలోని చిన్నపేగు, పెద్ద పేగు కదలికలు కూడా సులువుగా మారతాయని చెబుతున్నారు. ‘ఇలా కూర్చున్నప్పుడు మన మోకాలు 90 డిగ్రీల వరకు వంగుతుంది. శరీరంలోని మృదులాస్థి కదలికలకు సైనోవియల్ ఫ్లూయిడ్ కీలకం. మనం ప్రతిరోజూ కూర్చోవడం వల్ల ఈ ఫ్లూయిడ్ పూర్తిగా విస్తరిస్తుంది. ఫలితంగా కీళ్లు త్వరగా అరిగిపోకుండా దోహదపడుతుంది’అని వివరించారు.
శభాష్ ఉపాసనా..
భారతీయ టాయిలెట్ విధానాన్ని ప్రమోట్ చేస్తూ.. అందులో ఉన్న ఆరోగ్య రహస్యాలను వివరించేందుకు ముందుకు వచ్చిన ఉపాసనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ట్వీట్ చేసిన 24 గంటల్లోనే నెటిజన్లు 900 వరకు రీట్వీట్ చేశారు. 8 వేల వరకు లైకులు పడగా.. 300 వరకు కామెంట్లతో ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు.