చైనా తరహాలో పారిశ్రామిక పార్క్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చైనా తరహా పారిశ్రామిక పార్క్‌ను అభివృద్ధి చేస్తామని, పారిశ్రామిక అనుమతుల విషయంలో సరళ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. బిర్లా కంపెనీ చైర్మన్ సీకే బిర్లా, ఎండీ దీపక్‌కేత్ర శనివారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారని, ఇక్కడి పారిశ్రామిక విధానం బాగుందని చెప్పారు. తెలంగాణలో సిమెంట్ ఫ్యాక్టరీలను, వైద్యవిద్య రంగంలో సేవలను విస్తరిస్తామన్నారు. ఇందుకు ప్రభుత్వ సహకారం అవసరమని వారు కేసీఆర్‌ను కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమల కోసం అనుకూలంగా ఉన్న 2 లక్షల ఎకరాల భూమిని టీఎస్‌ఐఐసీకి ఇస్తామని, ప్రభుత్వం చొరవ తీసుకొని అన్ని అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు. ఇందుకోసం దేశంలోనే అత్యుత్తమమైన సింగిల్‌విండో విధానాన్ని ప్రవేశపెడతామని, సీఎం కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి రెండు, మూడు వారాల్లో అనుమతులు ఇస్తామని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, పరిశ్రమల శాఖ కార్యదర్శి ప్రదీప్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.
చంద్రకాంత్ బిర్లాకు సమయం ఇవ్వని బాబు:
కాగా చంద్రకాంత్ బిర్లాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు తీరిక లేకుండా పోయింది. దీంతో బిర్లా ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. 12 కంపెనీలకు అధినేత అయిన చంద్రకాంత్ వంటి పారిశ్రామికవేత్తకు బాబు సమయం కేటాయించకపోవడంపై అధికారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.