‘కడియం’ ప్రకటన సరికాదు
► పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
► పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జీవన్
ఆదిలాబాద్ టౌన్ : విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అసెంబ్లీలో చేసిన ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దారట్ల జీవన్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని పీఆర్టీయూ సంఘ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి ఎంఈవో, పీజీ హెచ్‌ఎం పోస్టులను నేరుగా భర్తీ చేస్తామని గురువారం అసెంబ్లీలో పేర్కొన్నారని, దీంతో ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందన్నారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే పోస్టులను నేరుగా భర్తీ చేస్తామనడం సరికాదన్నారు. ఏకీకృత సర్వీస్‌రూల్ తీసుకొచ్చిన తర్వాత ఎంఈవో, ఉప విద్యాధికారి, డైట్ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సర్కార్ బడుల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడుతామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోందన్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తమ సంఘం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో కలిసి గ్రామస్తుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి ఐదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో పాఠాలు బోధిస్తామన్నారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, విద్యుత్ సౌకర్యాలు కల్పించాలన్నారు. పంచాయతీకి ఒక పాఠశాలను కొనసాగిస్తే తమ సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
9నెలల ఏరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఈనెల 10న మంచిర్యాలలోని పద్మావతి గార్డెన్‌లో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల సంఘ బాధ్యులు హాజరుకావాలని కోరారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మెట్టు ప్రహ్లాద్, సత్యనారాయణగౌడ్, రాజన్న, రమేశ్, ప్రకాశ్, రాజన్న, జిల్లా బాధ్యులు రవి కుమార్, సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.