‘అవిశ్వాసం’ సెగ | Internal Strife In The TRS In Karimnagar | Sakshi
Sakshi News home page

‘అవిశ్వాసం’ సెగ

Published Sun, Aug 5 2018 8:30 AM | Last Updated on Sun, Aug 5 2018 8:30 AM

Internal Strife In The TRS In Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌లో అధికార పార్టీలోని కొందరు నేతల్లో మధ్య ఉన్న అంతర్గత కలహాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న ఈ అభిప్రాయభేదాలు ఇటీవలి అవిశ్వాస తీర్మానాలతో మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానాల వెనుక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పాత్ర ఉండటం.. వాటిని ఎదుర్కోవడమో, తిప్పి కొట్టడం వెనక ఉన్నది సైతం ఆ పార్టీకి చెందిన జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులే కావడం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పలుచోట్ల చోటు చేసుకున్న ‘అవిశ్వాసం’ రాజకీయాలతో అధికార పార్టీ నేతల మధ్యన ఏర్పడిన అంతర్గత విభేదాలు మరోసారి బయట పడ్డాయి.

‘అవిశ్వాసం’తో వేడెక్కిన హుజూరాబాద్‌..
హుజూరాబాద్‌ ఎంపీపీ, ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతా రావు సతీమణి వొడితెల సరోజినిదేవిపై అవిశ్వా సం నోటీసు ఇవ్వడంతో ఒక్కసారిగా హుజూరా బాద్‌ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ నాయకుడు, హుజూరాబాద్‌ మున్సిపాలిటీ చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌ (బ్రహ్మచారి)పై ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఇచ్చిన అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు 18 మంది అవిశ్వాసంపై సంతకాలు చేయడం.. ఆ తర్వాత విజయ్‌కుమార్‌ రాజీనామా కు సిద్ధమయ్యారు. ఈ వివాదం కొలిక్కి వస్తుందనుకున్న సమయంలో హుజూరాబాద్‌ ఎంపీపీపై ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీటీసీ సభ్యులను కలుపుకుని టీఆర్‌ఎస్‌కు చెందిన బావు తిరుపతి తొమ్మిది మంది సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని జెడ్పీ సీఈవో, ఆర్‌డీవోలకు ఇవ్వడం కొత్త వివాదానికి తెరలేపింది. ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు మధ్య సఖ్యత లేదన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది.

ఈ ఇద్దరు నేతలు, వర్గాల మధ్య పొసగడం లేదన్న సంగతి ఆ పార్టీలోని వర్గాల్లోనూ ఉంది. ఇదే సమయంలో సరోజినీదేవిపై అవిశ్వాసం పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఓ వైపు కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు, ఆయన కుమారుడు, హుస్నాబాద్‌ ఎమ్మెల్మే వి.సతీష్‌రావు, మరోవైపు మంత్రి ఈటల రాజేందర్‌ రంగంలోకి దిగారు. ఇంకోవైపు కాంగ్రెస్‌ ఎంపీటీసీలను శాంతపరచేందుకు ఆ పార్టీకి చెందిన మండల మాజీ మండల ప్రజాప్రతినిధి, ఓ ప్రజాప్రతినిధి, ప్రముఖ కాంట్రాక్టర్‌ తదితరులను కూడా రంగంలోకి దింపారు. సతీష్‌కుమార్‌ హన్మకొండలోని హంటర్‌రోడ్‌లో ఎంపీటీసీలతో చర్చించగా, మంత్రి ఈటల రాజేందర్‌ కరీంనగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో అవిశ్వాసం నోటీసు ఇచ్చిన ఎంపీటీసీల కూటమితో మాట్లాడారు. ఈ ఇరువర్గాలు కూడా అసంతృప్తి ఎంపీటీసీలకు ప్రభుత్వ పనులు ఇప్పించేందుకు హామీ ఇవ్వడంతో ‘అవిశ్వాసం’ వేడి చల్లారింది. సద్దుమణిగింది.

రచ్చకెక్కిన రామగుండం రాజకీయాలు..
ఇండిపెండెంట్‌ కార్పొరేటర్‌గా గెలుపొంది ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆశీస్సులతో టీఆర్‌ఎస్‌లో చేరి మేయర్‌గా ఎన్నికైన కొంకటి లక్ష్మీనారాయణ తిరిగి టీఆర్‌ఎస్‌ చేతిలోనే ఓటమి పాలయ్యారు. దీంతో రామగుండం నియోజకవర్గం అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే, ఆర్టీసీ సోమారపు సత్యనారాయణ, ఎంపీ బాల్క సుమన్‌ వర్గీయుల మధ్య ఎప్పటి నుంచో వర్గపోరు సాగుతోంది. బయటికి కనిపించకపోయినా పోలీసు అధికారుల మొదలు పలు అంశాల్లో ఒకరి నిర్ణయాలను ఒకరు అడ్డుకున్న సంఘటనలు అనేకం. ఈ పోరులో రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎంపీ సుమన్‌ వర్గంగా ముద్రపడిన మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసం వరకు దారితీసిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన అవిశ్వాస తీర్మానం అనేక మలుపులు తిరిగింది. నాటకీయ ఫక్కీలో పరిణామాలు చోటు చేసుకున్నవి.

ఆ క్రమంలో మనస్థాపానికి గురైన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసమే ప్రకటించారు. ఆ తర్వాత తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో మళ్లీ ఆయనే హైదరాబాద్‌లో మీడియా ముందు చెప్పడం వంటి పరిణామాలు రక్తికట్టించాయి. స్వపక్షంలోనే తన రాజకీయ ప్రత్యర్థిగా తయారైన మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి అధిష్ఠానం నుంచి ఎలాంటి అడ్డుకట్ట లేకుండా ఎమ్మెల్యే చక్రం తిప్పి సక్సెస్‌ అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు, వర్గీయుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రామగుండం అభివృద్ధిని ఎమ్మెల్యేను అడ్డుకున్నారని శనివారం కొంకటి లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మాజీ మేయర్‌ అయిన కొంకటి లక్ష్మీనారాయణ, పార్టీ నాయకుడు కోరుకంటి చందర్, పోలీసు హౌజింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్, జెడ్పీటీసీ సంధ్యారాణి సైతం గ్రూపులుగా కొనసాగుతుండటంతో రామగుండం రాజకీయాలు రచ్చకెక్కాయి.

నువ్వా–నేనా.. ఎమ్మెల్యే రమేష్, తుల ఉమ
కరీంనగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. కొద్ది మాసాలుగా పార్టీ సభ్యత్వం, పదవులు, పనుల విషయంలో ఈ ఇద్దరు నేతలు, వర్గీయుల మధ్య రసవత్తర పోరే సాగుతోంది. కమిటీలకు కమిటీలు రద్దు చేయడం, మరికొందరిపై బహిష్కరణ వేటుతోపాటు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునే వరకు గొడవలు వెళ్లాయి. తాజాగా వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈ ఇద్దరు నేతల మధ్య మరింత అగాధం పెరిగిందంటున్నారు. ఎంపీపీ వెంకటేశ్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ వర్గీయుడు కాగా, ఆయనపై ఎమ్మెల్యే రమేష్‌ వర్గీయులు నోటీసు ఇచ్చినట్లు చెప్తున్నారు. మొత్తం తొమ్మిది మందితో అవిశ్వాసం నోటీసు ఇవ్వగా, గత నెల 25న నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో తిప్పాపూర్‌ ఎంపీటీసీ అహ్మద్‌పాషా గైర్హాజర్‌ కాగా వెంకటేశ్‌పై అవిశ్వాసం వీగిపోయింది. ఈ వ్యవహారంలో తుల ఉమ కీలకంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతోంది.

 అదేవిధంగా బీజేపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొంది టీఆర్‌ఎస్‌లో చేరిన నామాల ఉమ వేములవాడ మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. ఇటీవల ఆమె భర్త లక్ష్మీరాజంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 20 మందిలో 15 మంది కౌన్సిలర్లు నామాల ఉమను దింపేందుకు నోటీసు ఇచ్చారు. ఇదే సమయంలో క్యాంపునకు తరలిన 15 మంది ఎంపీటీసీల్లో ఇద్దరు (నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశం) బయట పడటంతో సీన్‌ రసవత్తరంగా మారింది. ఈ వ్యవహరంలోనూ ఇద్దరు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా వుంటే కరీంనగర్‌ ఎంపీపీ వాసాల రమేష్‌కు అవిశ్వాసం ముప్పు తప్పింది. మొత్తం 24 మంది ఎంపీటీసీ సభ్యుల్లో సుమారు 17 మంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవిశ్వాసానికి సిద్ధంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ రంగ ప్రవేశం చేశారు. ఒకేపార్టీలో ఉంటూ అవిశ్వాసం పెట్టడం సరికాదని, ఇరువర్గాలకు నచ్చజెప్పిన ఆయన చివరకు వాసాలపై ‘అవిశ్వాసం’కు తెరవేశారు. అలాగే కరీంనగర్‌ నగరపాలక సంస్థకు చెందిన మెజార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే కమలాకర్‌ ఎదుట తమ అక్కసు వెళ్లబోసుకోగా, పార్టీకి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరించొద్దని సూచించి, వారించినట్లు చర్చ ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement