రైల్వే ప్రాజెక్టుల భారం రాష్ట్రంపైనే! | Investment Needed in Railways for Growth: Suresh Prabhu | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రాజెక్టుల భారం రాష్ట్రంపైనే!

Published Tue, Jan 20 2015 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

రైల్వే ప్రాజెక్టుల భారం రాష్ట్రంపైనే!

రైల్వే ప్రాజెక్టుల భారం రాష్ట్రంపైనే!

* పనులు జరగాలంటే నిధులు ఖర్చు చేయాల్సిందే  
* కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతోనే ప్రాజెక్టుల పూర్తి
* సీఎం కేసీఆర్‌కు రైల్వే మంత్రి ప్రతిపాదన

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారం భరించాల్సిందే! కొత్త రైళ్లో, కొత్త లైన్లో కావాలంటే ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు ఖర్చుచేయాల్సిందే!! హైదరాబాద్ పర్యటన లో భాగంగా రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు పరోక్షంగా ఇదే విషయాన్ని తేల్చిచెప్పారు. రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో స్పెషల్ పర్పస్ వెహికల్ (ఎస్పీవీ) ద్వారానే ప్రాజెక్టుల పూర్తి సాధ్యమని తేటతెల్లం చేశారు. సోమవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రెండు కొత్త రైళ్లను ప్రారంభించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడిన సురేశ్‌ప్రభు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడం సాధ్యమని చెప్పుకొచ్చారు.
 
  ‘‘పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చటం రైల్వేకు అతిపెద్ద సవాల్. దాన్ని అధిగమించేందుకే సంస్కరణలు చేపట్టబోతున్నాం. తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు కట్టుబడి ఉన్నా అది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యం. రైల్వే బడ్జెట్ తో ప్రమేయం లేకుండా నిరంతరాయంగా ప్రాజెక్టుల కేటాయింపు ఉంటుంది. సామాన్యులపై భారం వేస్తూ చార్జీలు పెంచుతారా అని అంతా అడుగుతున్నారు. రైల్వేపై భారం అంటేనే సామాన్యులపై భారం. ఎందుకంటే ైరె ళ్లను వాడుకునేదే వారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
 
 అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కలిసిన సురేశ్‌ప్రభు ఈ మేరకు ప్రతిపాదన చేశారు. మూడు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్టు వెల్లడించారు. తెలంగాణకు సంబంధించి ప్రస్తుతం రైల్వే బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలను ఇప్పటికిప్పుడు పట్టాలెక్కించటం అసాధ్యమని సురేశ్‌ప్రభు మాటలు స్పష్టం చేస్తున్నా యి. ఒకవేళ ఎస్పీవీ విధానం అమలైతే రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను ఎస్పీవీ పరిశీలించి ముఖ్యమైనవాటిని రైల్వే బోర్డుకు పంపుతుంది. రైల్వేబోర్డు వాటిని పరిశీలించి ప్రాజెక్టు వ్యయాన్ని నిర్ధారిస్తుంది. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఖర్చు ను భరించాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్టులపై వచ్చే లాభాన్ని అవసరమైతే అదే రాష్ర్టంలో కొత్త రైల్వే ప్రాజెక్టులకు ఖర్చు చేస్తారు.
 
 రైల్వేను ప్రైవేటీకరించం: సురేశ్‌ప్రభు
 రైల్వేల పగ్గాలు శాశ్వతంగా ప్రభుత్వం వద్దే ఉంటాయని...దీన్ని ప్రైవేటీకరించబోమని రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు స్పష్టం చేశారు. అయితే  రైల్వేల అభివృద్ధి, ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే సంస్థలోకి ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యం (పీపీపీ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను ఆహ్వానిస్తున్నామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ‘భారతీయ రైల్వేల సిగ్నల్ ఇంజనీరింగ్ సంస్థ’(ఇరిసెట్)లో ‘భారతీయ రైల్వేల్లో పీపీపీ, ఎఫ్‌డీఐలు’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి సురేశ్‌ప్రభు పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్ల కోసం ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి భారీ డిమాండ్ ఉన్నా రైల్వేల ప్రస్తుత మౌలిక స్థితిగతులకు ఈ డిమాండ్లను తీర్చే సామర్థ్యం లేదన్నారు. బలహీనంగా ఉన్న రైల్వేల ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని సంస్థ ఆధునీకరణ కోసం సాధ్యమైన అన్ని మార్గాల్లో ఆర్థిక వనరులను సృష్టించాల్సిన అవసరముందన్నారు.
 
  అందువల్ల పీపీపీ, ఎఫ్‌డీఐల అంశంపై రైల్వే ఉద్యోగులు అపోహలు పెట్టుకోరాదని సూచించారు. రైల్వేల ఆధునీకరణలో భాగంగా ఇస్రో, డీఆర్‌డీఓ వంటి సంస్థల నుంచి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరిస్తామన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ రక్షణలేని రైల్వే క్రాసింగ్‌ల వద్ద రక్షణ కల్పించడంతోపాటు రైళ్లను పరిశుభ్రంగా ఉంచి ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన అవసరముందన్నారు. సదస్సులో దక్షిణ మధ్య రైల్వే జీఎం పీకే శ్రీవాస్తవ, సీటీఆర్‌ఏఎం అధ్యక్షులు దేవిప్రసాద్ పాండే తదితరులు మాట్లాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement