
ప్రస్తుత భవనాలను సీమాంధ్రకు కేటాయిస్తే ఊరుకోం..
విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయిస్తే సహించేదిలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.
- ఇలా చేస్తే మరో ఉద్యమం..
- టీఎన్జీవో, టీజీవో నేతల హెచ్చరిక
సుల్తాన్‌బజార్,న్యూస్‌లైన్: విభజన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను సీమాంధ్ర ప్రభుత్వానికి కేటాయిస్తే సహించేదిలేదని తెలంగాణ ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. గురువారం టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు కోఠిలోని కుటుంబసంక్షేమశాఖ కమిషనర్, డీహెచ్‌లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
అనంతరం సంఘం ప్రతినిధులు జూపల్లి రాజేందర్, నాగరాజు, షబ్బీర్‌అహ్మద్, శ్రీనివాస్, హరి, వీరయ్య, సరళ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగుతున్న డీఎంఈ, డీహెచ్, వైద్యవిధానపరిషత్, కుటుంబసంక్షేమశాఖ కార్యాలయాలను విభజించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని తెలిసిందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోతున్న తరుణంలో తెలంగాణకు చెందిన కార్యాలయాలను బంజారాహిల్స్, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు ప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు భవనాల్లోకి తరలించేందుకు సీమాంధ్ర అధికారులు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఉద్యోగులు తమ సొంత ప్రాంతాలకు తరలివెళ్లాల్సి ఉండగా..వారిని ప్రస్తుతం ఉన్న కార్యాలయాల్లో కొనసాగిస్తూ తెలంగాణ కార్యాలయాలను మాత్రం అద్దె భవనాల్లోకి తరలించే చర్యలు మానుకోవాలని సూచించారు. లేకుంటే మరో ఉద్యమానికి సన్నద్ధమవుతామని వారు హెచ్చరించారు.