రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైన పోశయ్య
ఆ కుటుంబం రెక్కల కష్టాన్నే నమ్ముకుంది. కూలీ చేసి జీవనం సాగిస్తోంది. ఉన్ననాడు తింటూ.. కూలీ దొరక్కన్నాడు పస్తులున్నారు. అయినా వారెప్పుడూ ఆధైర్యపడలేదు. ఎప్పుడో ఒకప్పుడు మనకూ మంచిరోజులు వస్తాయనే ఆశతో ఆనందంగా జీవనం సాగించారు. గుడిసె తప్ప ఇంకేమీ ఆస్తుల్లేని ఆఇంట్లోకి అనారోగ్యం చొరబడింది. రెండు కిడ్నీలు పాడై పోవడంతో కుటుంబ పెద్ద మంచానికే పరిమితమయ్యాడు. కనీసం ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం పొందుదామన్నా ఇప్పటికీ వారికి రేషన్ కార్డే లేదు. ఇలా కష్టాలన్నీ ఒక దాని వెంట ఒకటి తరుముకొస్తుంటే చికిత్స కోసం రూ. 8 లక్షలు అప్పు చేశారు. చెన్నూర్, మంచి ర్యాల, వరంగల్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయం కాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆ ఇంటి దీపం కూలీ పనులకెళ్లి కుటుంబాన్ని సాకుతోంది. మనసున్న మా రాజులు చేయూతనందిస్తారని ఆ కుటుంబం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది.
చెన్నూర్‌రూరల్: భార్య, కుమారుడితో సరదాగా గడిపే ఆ ఇంటి పెద్దను కిడ్నీల వ్యాధి కుంగదీసింది. ఆ ఇంటి పెద్ద కూలీ పనులు చేసి భార్య పిల్లలను పోషించుకునేవాడు. కానీ ప్రస్తుతం ఏ పని చేయలేక భార్య కూలీకి వెళ్తేగాని పూట గడవని పరిస్థితి నెలకొంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని దుగ్నెపల్లి పంచాయతీ పరిధిలోని వెంకంపేట గ్రామానికి చెందిన జాడి పోశయ్యది నిరుపేద కుటుంబం. ఉండేందుకు సరైన ఇళ్లు కూడా లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్ధితి. పోశయ్య తండ్రి మల్లయ్య చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి వీరక్క కూలీ పనులు చేసి పెంచి పెద్ద చేసింది. పోశయ్యకు భార్య ఎల్లక్క, మూడేళ్ల బాబు మల్లిఖార్జున్ ఉన్నాడు.
కుటుంబాన్ని కుదిపేసిన కిడ్నీ వ్యాధి..
రెండేళ్ల క్రితం పోశయ్య శరీరం వాపు రావడంతో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు కరీంనగర్‌కు వెళ్లమని సూచించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యులు పరీక్షలు చేసి రెండు కిడ్నీలు చెడిపోయాయని నిర్ధారించి చెప్పారు. పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో అప్పటి నుంచి నెలకు ఒక్కసారి హైదరాబాద్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుని డయాలసిస్ చేయించుకుంటున్నాడు. భార్య ఎల్లక్క కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇప్పటి వరకు అందిన చోటల్లా సుమారు రూ.8 లక్షల వరకు అప్పులు చేసి మరీ వైద్యానికి ఖర్చు చేశారు. ఒక కిడ్నీ మారిస్తే సుమారు రూ.30 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో గుడిసె తప్ప వేరే ఆస్తి లేని తాము అన్ని డబ్బులు ఎక్కడి నుంచి తీసుకు రావాలని పోశయ్య భార్య ఎల్లక్క కన్నీరుమున్నీరవుతోంది. ప్రతి నెలా హైదరాబాద్‌కు డయాలసిస్‌కు వెళ్లిన ప్పుడల్లా సుమారు రూ.6వేల వరకు ఖర్చు అవుతోందని పోశయ్య ఆందోళన చెందుతున్నాడు. కనీసం తమకు రేషన్ కార్డు కూడా లేదని, ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదని వారు ఆందోళన చెందుతున్నారు.
ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు..
వైద్యానికి ఇప్పటికే అప్పులు చేసి రూ.8 లక్షల వరకు ఖర్చు చేశామని ఇప్పుడు కిడ్నీ అమర్చేందుకు రూ.30 లక్షలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చేదని భార్య ఎల్లక్క కన్నీరు మున్నీరవుతోంది. ప్రభుత్వం ఆదుకోవాలని, దాతలు తన భర్త వైద్యానికి ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. అలాగే రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పించాలని వారు వేడుకుంటున్నారు.
నా భర్తను కాపాడండి..
నాభర్త ఆరోగ్యం బాగా లేదు. కుటుంబం నడుసుడు కష్టమైతాంది. నేను కూలీ పనికి పోతాన. వచ్చిన డబ్బులతో ప్రతినెలా ఆస్పత్రికి తీసుకపోతాన. మాకు ఆస్తి కూడా లేదు. నా భర్త ఆరోగ్యం మంచిగ కావాలని తిరగని హాస్పటల్ లేదు. ఎన్నో చోట్ల అప్పుజేసినం. పెద్దసార్లు, గవర్న మెంటు ఆదుకోవాలి. నా భర్తకు వైద్యం అందించేందుకుసాయం అందించాలి.– జాడి ఎల్లక్క, వెంకంపేట
Comments
Please login to add a commentAdd a comment