
'నేరాన్ని నేరంగా చూడకుండా రాజకీయం చేస్తున్నారు'
ఓటుకు నోటు వ్యవహారంలో నేరాన్ని నేరంగా చూడకుండా రాజకీయం చేస్తుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు.
హైదరాబాద్:ఓటుకు నోటు వ్యవహారంలో నేరాన్ని నేరంగా చూడకుండా రాజకీయం చేస్తుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందని లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు నోటు వ్యవహారం నిజంగా సిగ్గు చేటన్నారు. అసలు ప్రజాస్వామ్యంలో సీఎం అనే వ్యక్తి జవాబుదారీగా ఉండాలే గానీ.. అవినీతికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని జేపీ ప్రశ్రించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వబోతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోవడంతో పాటు ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ లో సంభాషిస్తూ సూత్రధారి పాత్ర పోషించడం తీవ్ర సంచలనం సృష్టించింది.
ఓటుకు నోటు అంశంపై సోమవారం సాయంత్రం జేపీ సాక్షి టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్యూలో అనేక విషయాలను ప్రస్తావించారు. ఓటుకు నోటు వ్యవహారం తనకు బాధగా అనిపించకపోయినా.. ఆశ్యర్యం వేసిందన్నారు. ఒక్క ఎమ్మెల్సీ ఓటుకు రూ.5 కోట్లా? అని ఆశ్యర్య పడాల్సిన పరిస్థితులను తీసుకొచ్చారన్నారు. రాజకీయాలు ఈస్థాయికి దిగజారిపోవడం బాధకరమన్నారు. ఈ అంశాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయంగా చూస్తున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో లా అండ్ ఆర్డర్ అనే అంశం చట్టపరంగా తేలాల్సి ఉందని.. అయితే దీన్ని రాజకీయం చేస్తున్నారన్నారు. ప్రజలను రాజకీయంగా బలిచేసే పరిస్థితి దాపురించిందని జేపీ అన్నారు. చట్టబద్ధ పాలనను వేరుగా, నేరాన్ని వేరుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.ఈ వ్యవహారాన్ని మొత్తంగా ఒకేతాటిపైకి తెచ్చి గందరగోళ పరిస్థితులు స్పష్టించారన్నారు. దీంతో పాటు కులం, మతం, ప్రాంతం రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని ఆవరించిందన్నారు. రాజకీయంగా తాను ఎవరిపైనా వ్యాఖ్యలు చేయకపోయినా.. వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు.
ఇంటర్వ్యూలో జేపీ ఇంకా ఏం చెప్పారంటే..
- ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్లు ఉంటుంది కాబట్టి.. శాంతిభద్రతల పర్యవేక్షణకు గవర్నర్కు నిజాయతీ పరులైన ఇద్దరు సలహాదారులను నియమించాలి
- ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలి. దీన్ని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా చూడరాదు.
- రాజకీయ పార్టీలు అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట మాట్లాడటం మంచిదికాదు
- రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాలను తుంగలో తొక్కటం సరికాదు
- రాజకీయ పార్టీలు మంచిని సమర్థించాలి. చెడును వ్యతిరేకించాలి
- మనం రాజకీయ ఉన్మాదంలో ఉన్నాం. పదవుల కోసం వెంపర్లాడటం మంచి పద్దతి కాదు
- రాజకీయాలు కులం, మతం చుట్టూ తిరుగుతున్నాయి