ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తేల్చిచెప్పారు...
- జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి
పరిగి: ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి తేల్చిచెప్పారు. గురువారం ఆమె పరిగి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆహారభద్రత కార్డులు, రుణమాఫీ పత్రాలు, ఆధార్‌సీడింగ్ తదితర అంశాలపై రెవెన్యూ అధికారులు, సిబ్బందితో చర్చించారు. పరిగిలో వ్యవసాయశాఖకు సంబంధించి ఒకటి, సివిల్‌సప్లైకి సంబంధించి మరొక గోదాంను ప్రభుత్వం నిర్మించాలనుకుంటోందని, వీటికోసం ప్రభుత్వ భూమిని పరిశీలించాలని తహసీల్దార్‌కు సూచించారు.
వాటర్ గ్రిడ్ కోసం..
జాపర్‌పల్లి సమీపంలోని సర్వేనంబర్ 8లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ కోసం 25 ఎకరాల భూమి అవసరమున్నందున ఆ భూమి కేటాయింపు సాధ్యాసాధ్యాలపై రెవెన్యూ అధికారులతో ఆమె చర్చించారు. అనంతరం జేసీ పరిగి ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి వెనకాల పెండింగులో ఉన్న ప్రహరీ నిర్మాణం, మార్చురీ గది అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కొండాపూర్ శివారులోని సోలార్ పవర్‌ప్రాజెక్టులో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని కలుపుకొన్నారనే ఆరోపణపై ఆమె నివేదిక కోరారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పై రెండు అంశాలకు సంబంధించి సీపీఎం డివిజన్ కార్యదర్శి వెంకటయ్య జేసీకి ఫిర్యాదు చేశారు. జేసీ వెంట తహసీల్దార్ విజయ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఆర్‌ఐ మహేష్, వీఆర్‌ఓలు జహంగీర్, నారాయణ, పాపయ్య తదితరులున్నారు.