అధికార పార్టీ నేతల్లో అప్పుడే విభేదాలు | Just then conflicts in ruling party | Sakshi
Sakshi News home page

అధికార పార్టీ నేతల్లో అప్పుడే విభేదాలు

Published Wed, Jul 23 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 10:42 AM

Just then conflicts in ruling party

సాక్షి ప్రతినిధి, వరంగల్ :  టీఆర్‌ఎస్ సర్కారు ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఆ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతరం పెరుగుతోంది. జిల్లాలోని ముఖ్యమైన అధికారుల పోస్టింగ్‌ల విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అప్పుడే ఆధిపత్య పోరు మొదలైంది. వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్డీఓ) పోస్టింగ్ విషయంలో ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ పోటాపోటీగా వ్యవహరించారు. చివరకు వినయ్‌భాస్కర్ అనుకున్నది సాధించారు.

డిప్యూటీ సీఎం రాజయ్య ప్రతిపాదిం చిన వారు ఆర్డీవోగా రాకుండా చేయగలిగారు. ఈ పరిణామం రాజయ్యకు, వినయ్‌భాస్కర్‌కు మధ్య అంతరం పెంచినట్లు కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు... మన ప్రణాళిక’ విజయవంతంగా జరుగుతోందనే అం శంపై సోమవారం డిప్యూటీ సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మ, వర్ధన్నపేట ఎమ్మెల్యే రమేశ్, ఇతర నేతలు హాజరయ్యారు.


పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌తోపాటు పలు వురు ఎమ్మెల్యేలు దూరంగా ఉండడంపై టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. ఆర్డీవో పోస్టింగ్ వ్యవహారం నుంచీ కీలక నేతలు ఇద్దరి మధ్య దూరం పెరిగిందని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ఐదు ఆర్డీవో పోస్టులున్నాయి. వీటిలో వరంగల్ ఆర్డీవో పోస్టు కీలకమైనది. జిల్లా కేంద్రంలో ఉండడమే కాకుండా ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్.. ఇతర అన్ని అంశాలు వరంగల్ ఆర్డీవో పరిధిలో ఉంటాయి. వరంగల్ నగరం, నగర సమీపంలోని రెవెన్యూ వ్యవహారాల్లో ఆర్డీవో పాత్ర కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ ఆర్డీవో పోస్టుకు అధికారుల్లోనూ పోటీ ఉంటుంది.

జిల్లాలోని కీలకమైన ప్రజాప్రతినిధులు సైతం ఈ పోస్టులో తమకు సహకరించే వారు ఉండేలా చూసుకుంటారు. ఇటీవల వరంగల్ ఆర్డీవో ఓజే.మధును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ స్థానంలో తమకు అనుకూలంగా ఉండే అధికారిని నియమించుకునేందుకు ఉప ముఖ్యమంత్రి ప్రయత్నించారు. గతంలో స్టేషన్‌ఘన్‌పూర్ తహసీల్దారుగా పనిచేసిన ఓ అధికారిని వరంగల్ ఆర్డీవోగా నియమించేందుకు సచివాలయం స్థాయిలో దృష్టి పెట్టారు. రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మరో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో ఈ విషయంపై నేరుగా సంప్రదించినట్లు తెలిసింది. రాజయ్య ప్రయత్నాలను పసిగట్టిన వినయ్‌భాస్కర్ రంగంలోకి దిగారు.

 జిల్లా కేంద్రంలోని నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ఆర్డీవో పోస్టింగ్ విషయంలో వినయ్ మరో ప్రతిపాదన ఇచ్చారు. జిల్లాతో ఎలాంటి సంబంధం లేని అధికారిని ఎవరిని నియమించినా ఫర్వాలేదు గానీ... ప్రొటోకాల్ పరంగా కీలక స్థానంలో ఉన్న వారి సిఫారసు మేరకు పోస్టింగ్ ఇస్తే తమకు ఇబ్బంది ఉంటుందని రెవెన్యూ మంత్రికి చెప్పుకున్నారు. ఈ విషయం తెలిసి ఉప ముఖ్యమంత్రి రాజయ్య మళ్లీ తాను ప్రతిపాదించిన అధికారి కోసం ప్రయత్నించారు.

ఆయన సూచించిన అధికారి పోస్టింగ్ ఫైల్ కూడా సిద్ధమైంది. ఉత్తర్వులు వెలువడుతాయనే తరుణంలో వినయ్‌భాస్కర్ మళ్లీ రెవెన్యూ మంత్రిని సంప్రదించారు. టీఆర్‌ఎస్‌లో తన సేవలు, నేపథ్యం, నగరం కేంద్రంలో ఎమ్మెల్యేగా ఇబ్బందులను వివరించారు. చివరికి వినయభాస్కర్ మాటే నెగ్గింది. నిజామాబాద్ జిల్లాలో పని చేస్తున్న డి.వెంకటమాధవరావును ప్రభుత్వం వరంగల్ ఆర్డీవోగా నియమించింది. వెంకటమాధవరావుతో పెద్దగా పరిచయం లేకున్నా... ఉప ముఖ్యమంత్రి ప్రతిపాదించిన అధికారి వస్తే తమకు ఆశించిన మేరకు సహకారం ఉండదనే ఉద్దేశంతోనే వినయభాస్కర్ దీనికి అంగీకరించినట్లు తెలిసింది. కాగా, గతంలో జరిగిన ఒక ఎన్నికల్లో వెంకటమాధవరావు వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన విధులు నిర్వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement