- చర్చిల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు
- ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య
హన్మకొండ చౌరస్తా : ఆరు దశాబ్దాల పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోంది.. అందులో భాగంగానే రూ.50వేల కోట్లు కేటాయించిందని ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. హన్మకొండ లోని మిషన్ ఆస్పత్రి ఆదివారం పునఃప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజయ్య మాట్లాడుతూ సామాజిక తెలంగాణకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉన్నారని చెప్పారు.
రాష్ట్రంలోని చర్చిల పునరుద్ధరణకు ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. మిషన్ ఆస్పత్రికి పూర్వ వైభవం తీసుకురావడానికి పాటుపడతాన ని అన్నారు. ఆస్పత్రి భూముల ఆక్రమణ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పును ఇరు వర్గాలు శిరసావహించాలని సూచించారు. వివాదంలో ఉన్న భూమి ఎవరికి వచ్చినా వైద్య సేవలందించేందుకు సహకరించాలని కోరా రు.
ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ పేదలకు సేవలందించే ఆస్పత్రి భూమిని కబ్జాచేసిన వారిని జైలుకు పంపించాలన్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని, ఆయనకు అందరం సహకరిస్తే త్వరలోనే బంగా రు తెలంగాణ సాకారమవుతుందని చెప్పారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిని కేసీఆర్ వదలరని, అందుకు గురుకుల్ ట్రస్టు నిర్మాణాల కూల్చివేతే నిదర్శనమని పేర్కొన్నారు.
జెడ్‌పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అంత కు ముందు సీబీసీ చర్చిలో ప్రత్యేక ప్రార్థలను చేశారు. కార్యక్రమంలో త్రినగర క్రైస్తవ సహవాసం అధ్యక్షుడు కురియన్, టీసీఎఫ్ అధికార ప్రతినిధి డాక్టర్ పల్లెపాడు దామోదర్, సీబీసీ చర్చి పాస్టర్ నిరంజన్‌బాబు, ఇమ్మానియల్, సుధాకర్, జాన్సన్, యాకోబ్, టి.పాల్, జోసఫ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజయ్యను క్రైస్తవ సంఘాల బాధ్యులు సన్మానించారు.
రోగుల భాగోగులు తెలుసుకున్న రాజయ్య
సాయంత్రం ఆస్పత్రిలోని వార్డులను సందర్శించిన డిప్యూటీ సీఎం రాజయ్య రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులు, ఇతర సమస్యలపై అడిగి తెలుసుకున్నా రు. సిబ్బంది అటెండెన్స్ రిజిష్టర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అప్పుడే పుట్టిన శిశువులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ ఆస్పత్రిని రెండు వందల పడకలకు విస్తరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. డిప్యూటీ సీఎం వెంట వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరక్టర్ డాక్టర్ సాంబశివరావు, వైద్యులు ఉన్నారు.
సమగ్ర సర్వేతోనే అర్హులకు ప్రయోజనం : డిప్యూటీ సీఎం
చిల్పూరుగుట్ట(స్టేషన్‌ఘన్‌పూర్) : సమగ్ర కుటుంబ సర్వే ద్వారానే అర్హులకు ప్రభుత్వ పరంగా ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని చిల్పూరు ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈనెల 19న నిర్వహించే సమగ్ర సర్వేపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని, అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరారు. ప్రస్తుతం తెలంగాణ జిల్లాల్లో మొత్తం 84 లక్షల కుటంబాలున్నాయని, వీరికోసం గత పాలకులు 1996లో మల్టీపర్పస్ హౌస్‌హోల్డ్ సర్వే, 2002లో బీపీఎల్ సర్వే, 2005లో సోషల్‌ఎకనామిక్, 2011, 2013లోనూ సర్వేలు నిర్వహించి 55లక్షల ఇండ్లు, 71లక్షల మందికి పింఛన్లు, కోటి 10లక్షల మందికి రేషన్ కార్డులిచ్చారని అన్నారు.
ఆయా ప్రభుత్వాల్లో అనర్హులు లాభపడగా పేదలు పేదలుగానే మిగిలిపోయారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఏగ్రామంలోకి వెళ్లినా ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్‌లు అడుగుతుండడంతో సీఎం కేసీఆర్ సమగ్ర కుటంబ సర్వే కార్యక్రమానికి స్వీకారం చుట్టారని వివరించారు. సర్వే రోజు తానుకూడా నియోజకవర్గంలో పర్యటిస్తానని చెప్పారు.
మంత్రి పదవితోపాటు ఉపముఖ్య మంత్రి పదవి ఇచ్చినందున 10 జిల్లాల్లో తిరగడం వలన నియోజకవర్గ ప్రజలను కలుసుకోవడంలో జాప్యం జరుగుతోందని, ఇక నుంచి వారంలో ఒక రోజు జిల్లా కేంద్రంలోనూ, మరొక రోజు నియోజకవర్గం లోని ఏదోఒక మండలంలో పర్యటించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటానని పేర్కొన్నారు.