కేఎల్లార్ రెడీ!
శాసనమండలి పోరుకు సన్నద్ధం
నామినేషన్ దాఖలుకు రంగం సిద్ధం
ఆయనతోపాటు తెరపైకి మరో నలుగురి పేర్లు
అభ్యర్థుల ఖరారుపై నేడు కాంగ్రెస్, టీడీపీ కీలక సమావేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్‌లో కదన కుతూహలం కనిపిస్తోంది. శాసనమండలి సమరానికి ససేమిరా అనడమే కాకుం డా... షరతులు విధించిన సీనియర్లు తాజాగా మెట్టు దిగి పోటీకి సై అంటున్నారు. పోటీ చేయడానికి తొలుత అయిష్టత కనబరిచిన నాయకులు ఇప్పుడు మాత్రం నామినేషన్ల దాఖలుకు రెడీ అవుతున్నారు. తాజా పరిణామాలను గమనిస్తే కాంగ్రెస్‌లో శాసనమండలి బరిలో దిగడానికి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, ముఖ్యనేతలు రమేశ్, ధారాసింగ్, బాలేష్‌లు శనివారం నామినేషన్ ఫారాలను సేకరించడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. వాస్తవానికి కౌన్సిల్‌కు పోటీచేసేందుకు ముఖ్యనేతలు ముందుకురాలేదు. బలవంతంగా బరిలో దింపినా.. భవిష్యత్తుపై భరోసా ఇస్తేనే పోటీ చేస్తామని షరతులు పెట్టారు.
ఈ క్రమంలోనే జిల్లా నాయకత్వం మాజీ మంత్రులు సబిత, ప్రసాద్, చంద్రశేఖర్, మాజీ శాసనసభ్యులు కేఎల్లార్, సుధీర్‌రెడ్డి పేర్లతో కూడిన జాబితాను టీపీసీసీకి పంపింది. ఈ మేరకు ఏకాభిప్రాయంతో జాబితాను పంపిన అధిష్టానం ఇప్పటివరకు అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలోనే మండలిలో పోటీకి వెనుకాడుతుందనే ప్రచారం ఊపందుకోవడంతో మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ కదనరంగంలోకి దిగాలని నిర్ణయించారు. దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి ఆయన మొగ్గు చూపినప్పటికీ, సుధీర్ వెనుకంజ వేస్తున్న తరుణంలో కాలయాపనతో ప్రత్యర్థులకు అవకాశమివ్వకుండా తానే పోటీ చేయాలనే అభిప్రాయానికొచ్చారు. ఈ కోణంలో సంఖ్యాబలం, పాతమిత్రుల మద్దతుపై అంతరంగికులతో కూడికలు, తీసివేతలపై కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా తన సహాయకుడి ద్వారా నామినేషన్ ఫారాలను తెప్పించారు. తనతోపాటు మరో నలుగురు అభ్యర్థులను కూడా తెరమీదకు తెచ్చిన ఆయన.. అధిష్టానం ఆదేశాలను శిరసావహిస్తానని స్పష్టం చేస్తున్నారు.
కేఎల్లార్ ఐతే ఒకే..!
శాసనమండలి రేసులో కేఎల్లార్ పేరును మాజీ మంత్రి సబిత ప్రతిపాదించారు. మొన్నటివరకు వైరివర్గాలు ఈ వ్యవహరించిన ఈ ఇరువురు నేతల మధ్య ఇటీవల వైరం తగ్గినట్లు కనిపిస్తోంది. అప్పట్లో ఒకరి పేరును మరొకరు ప్రతిపాదించినా.. పోటీకి మాత్రం నిరాకరించారు. ఈ క్రమంలోనే ఇటీవల మేడ్చల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేఎల్లార్ నివాసానికి సబిత వెళ్లడం.. ఇటీవల నవాబ్‌పేట ఉప ఎన్నికలో ఒకే ప్రచార వాహనంపై ప్రసంగించడం కాంగ్రెస్‌లో అసమ్మతి రాజకీయాలు కొంత మేర సద్దుమణిగేలా చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేఎల్లార్ మండలి బరిలో నిలవడానికి ఉత్సాహం కనబరుస్తున్నట్లు ఆర్థమవుతోంది. సబిత మద్దతుగా నిలిస్తే ప్రత్యర్థిని నిలువరించవచ్చని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంట్లో భాగంగానే నామినేషన్ దాఖలుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇదిలావుండగా, అభ్యర్థుల ఖరారుపై ఆదివారం కాంగ్రెస్ కీలక సమావేశం నిర్వహిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్ ముఖ్యనాయకులు పాల్గొనే ఈ సమావేశంలో ఇరుపార్టీల మధ్య పొత్తు ఖరారు కానుంది. అనంతరం చెరో సీటుకు పోటీచేసే అభ్యర్థులను ఖరారు చేసి.. అధిష్టానాలకు పంపే అవకాశం ఉంది.