
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని బీడు భూములను తడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహాయజ్ఞంలా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా జరుగుతున్న మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో 24 గంటల వ్యవధిలో ఏకంగా 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు (ర్యాఫ్ట్, పియర్స్) జరిగాయి. 400 మంది ఇంజనీర్లు సహా 4,824 మంది కార్మికులు శని వారం ఉదయం 8 గం. నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు శ్రమించి ఈ రికార్డు సృష్టించారు. దీనికోసం ప్రాజెక్టు సీఈ నల్లా వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ సుధాకర్‌రెడ్డి, ఎల్ అండ్ టీ ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణరాజు పర్యవేక్షణలో 4,824 మంది కార్మికులు, ఇంజనీర్లు 24 గంటలపాటు 3 షిఫ్టుల్లో పనిచేశారు. ఈ పనులు చేసేందుకు 120 ట్రాన్సిక్ మిల్లర్లు, 21 బ్లూమ్ ప్లేసర్స్‌తోపాటు గంటకు 870 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంగల 8 బ్యాచింగ్ ప్లాంట్లను వినియోగించారు. 6,238 మెట్రిక్ టన్నుల సిమెంట్ (1,24,751 లక్షల సిమెంట్ బస్తాలు), 1,070 మెట్రిక్ టన్నుల స్టీలు, 15,384 క్యూబిక్ మీటర్ల మెటల్ వినియోగించారు.
ఇక ముందూ పరుగులే..
మేడిగడ్డ బ్యారేజీ పనులు తొలి నుంచీ నెమ్మదిగానే సాగుతున్నాయి. బ్యారేజీ నిర్మాణ ప్రాంతంలో మహారాష్ట్ర నుంచి సహకారం అవసరమవడం, గోదావరికి ఏటా జూన్ నుంచి జనవరి వరకు నీటి ప్రవాహాలు కొనసాగుతుండటం, చిన్నపాటి వర్షాలకు నేల చిత్తడి కావడంతో రవాణా వాహనాలకు ఇబ్బందులు తలెత్తడంతో ఈ పనులు అనుకున్న స్థాయిలో జరగట్లేదు. గతేడాది డిసెంబర్‌లోనే మేడిగడ్డ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి కేసీఆర్... కాంక్రీట్ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. దీంతో అప్పటి వరకు బ్యారేజీ పరిధిలో 1,500 క్యూబిక్ మీటర్ల నుంచి 2 వేల క్యూబిక్ మీటర్ల వరకు పనులు జరగ్గా ఆ తర్వాత పకడ్బందీ ప్రణాళిక, అధికారుల మధ్య సమన్వయం, కార్మికులు, ఇంజనీర్లు, యంత్ర పరికరాల సంఖ్య పెంచడంతో పనుల్లో వేగం పెరుగుతూ వచ్చింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 15న మేడిగడ్డలో ఒక్కరోజే 7 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరిగాయి. అనంతరం మళ్లీ జూన్ నుంచి గోదావరి వరద కారణంగా పనులు నమ్మెదించాయి. గరిష్టంగా ప్రతిరోజూ 3 వేల నుంచి 4 వేల క్యూబిక్ మీటర్ల వరకు కాంక్రీట్ పనులను అధికారులు చేస్తూ వచ్చారు.
సీఎం ఆదేశాలతో పనుల పరుగులు...
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం ప్రాజెక్టు పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మేడిగడ్డ పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులను సత్వరమే చేయాలని ఆదేశించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు అక్కడ యంత్రాలు, కార్మికుల సంఖ్యను పెంచి 16,722 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని చేశారు. ఇకపై ప్రతిరోజూ కనిష్టంగా 8 వేల క్యూబిక్ మీటర్లు, గరిష్టంగా 10 వేల క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరిగేలా అధికారులు ప్రణాళిక రూపొందించుకున్నారు. మొత్తంగా మేడిగడ్డ పరిధిలో 17,89,382 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 12,58,032 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ పనులతోపాటే మేడిగడ్డ పంప్‌హౌస్, అన్నారం, సుందిళ్ల పరిధిలోని పనుల్లో వేగం పెంచారు. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 11 మోటార్లకు ఇప్పటివరకు 4 మోటార్లు అమర్చారు. అన్నారం బ్యారేజీలో 66 గేట్లు, సుందిళ్లలో 74 గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తవగా అన్నారం పంప్‌హౌస్‌లో 8 మోటార్లకుగాను 2, సుందిళ్ల పంప్‌హౌస్‌లో 9 మోటార్లకుగాను 2 మోటార్లు అమర్చారు. ఈ పనులన్నింటినీ వచ్చే మార్చి నాటికి పూర్తి చేసి జూన్¯Œలో ఖరీఫ్ నాటికి ఆయకట్టుకు నీటిని తరలించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రస్తుతం అందుకు తగ్గట్లే పనులు జరుగనున్నాయి.
22వ తేదీ ఉదయం 8 నుంచి 23వ తేదీ ఉదయం 8 గంటల వరకు జరిగిన రికార్డు కాంక్రీట్ పని ఇలా..(క్యూబిక్ మీటర్లలో)
సమయం(గంటల్లో) చేసిన పని ఇలా..
8–11 2,132
11–2 2,097
2–5 2,085
5–8 2,041
8–11 2,046
11–2 2,107
2–5 2,074
5–8 2,140
మొత్తం 16,722
కాళేశ్వరం బ్యారేజీల పరిధిలో జరిగిన పని ఇలా.. (క్యూబిక్ మీటర్లలో)
మేడిగడ్డ బ్యారేజీ
పని మొత్తం క్వాంటిటీ చేసిన పని
మట్టి పని 54,43,515 52,48,354
కాంక్రీటు పని 17,89,382 12,58,032
అన్నారం బ్యారేజీ
మట్టి పని 29,08,296 29,08,296
కాంక్రీటు పని 11,95,000 11,83,642
సుందిళ్ల బ్యారేజీ
మట్టి పని 8,65,320 8,52,174
కాంక్రీటు పని 10,54,799 10,39,678
Comments
Please login to add a commentAdd a comment