అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ ఎజెండా
మండిపడిన టీఆర్‌ఎస్ నేతలు కర్నె, చింతా ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధి ని అడ్డుకోవడమే కాంగ్రెస్ ఎజెండా అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. పాలమూరులో కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టుల కు అడ్డుపడుతుంటే రంగారెడ్డి జిల్లాలో అదే పార్టీ నేతలు ప్రాజెక్టులు కావాలంటూ పాదయాత్రలు చేస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్ తాండూర్ బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు.
భూదందాలు, అరాచకాలు చేసిన కాంగ్రెస్‌లో ఉంటూ సంపత్ విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. ‘వ్యవ సాయ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అన్న సంగతి కాంగ్రెస్ నేతలకు తెలియదా? ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య వంటి నేతలకు ఈ విషయాలు తెలిసీ ధర్నాలు చేస్తున్నారా? నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతాంగానికి కంపెనీలతో నష్ట పరిహారం ఇప్పించిన విషయం వారు మరిచిపోయారా? ఖమ్మంలో జీవ అనే కంపెనీతో రూ. కోటి నష్ట పరిహారం ఇప్పించలేదా’ అని నిలదీశారు.