గోబెల్స్ ప్రచారానికి అడ్డా గాంధీ భవన్
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: గోబెల్స్ ప్రచారానికి గాంధీభవన్ ప్రధాన అడ్డాగా మారిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్‌కు గోబెల్స్–2 ఆఫీసుగా పేరు మార్చుకుంటే బావుంటుందని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మంగళ వారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎన్నింటిని భర్తీ చేయాలనే విషయాలపై కనీస అవగాహన లేకుండా కాంగ్రెస్ నేతలు కాకి లెక్కలు చెబుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని షబ్బీర్ అలీకి హితవుపలికారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాం గ్రెస్‌కు 50 సీట్లు వస్తాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ప్రకటన నవ్వు తెప్పిస్తోందని, వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే కాంగ్రెస్ పరిమితం కాక తప్పదన్నారు.