సిద్దిపేట ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
కొమురవెల్లి(సిద్దిపేట) : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని కేజీబీవీ కస్తూరిబా బాలికల పాఠశాలలో 9 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. దీంతో వారిని సోమవారం హైదరాబాద్ నగరంలోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. వివరాలు... మండల కేంద్రంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో మొత్తం 86 మంది విద్యార్థులున్నారు. కాగా మూడు రోజుల క్రితం పూజిత అనే విద్యార్థిని దగ్గుతూ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఇంటికి పంపించారు. పూజిత ఆదివారం తిరిగి కస్తూరిబా పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో పూజితతో కలిసి ఉన్న రూమ్‌లోని హారిక, శ్రీవాణిలకు తీవ్రమైన దగ్గు సోకింది.
దీంతో పూజితతో పాటు హారిక, శ్రీవాణిలను చికిత్స కోసం స్థానిక ఆర్‌ఎంపీల వద్దకు తీసుకెళ్లారు. ముగ్గురి పరిస్థితి తీవ్రంగా ఉండడంతో వెంటనే వారిని పాఠశాల ఉపాధ్యాయులు, ఎంఈఓ రాములు వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషయమించడంతో వారిని వెంటనే నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. 6వ తరగతికి చెందిన కె. పూజిత, సీహెచ్.అంజలి, 7వ తరగతి చదివే ఈ.అంజలి, ఏ.రేఖ, జి.అశ్విత, 8వ తరగతి చదువుతున్న పి. భాను, ఎస్.అంబికలతో పాటు హైదరాబాద్‌కు తరలించిన 7వ తరగతి విద్యార్థిని టి.హరిక, 8వ తరగతికి చెందిన శ్రీవాణిలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కస్తూరిబా పాఠశాలలో ఆదివారం ఉదయం విద్యార్థులకు చపాతీ, మధ్యాహ్నం చికెన్, రాత్రి క్యాబేజీ వండి పెట్టారు. ఉదయం అల్పాహారం కోసం పులిహోర చేసి పెట్టారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ నీరజను వివరణ కోరగా కేజీబీవీ పాఠశాల చుట్టూ వరి పొలాలకు వాడిన రసాయన ఎరువుల ప్రభావగంతోనే విద్యార్థినులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ భిక్షపతి పాఠశాలకు చేరుకుని మిగతా విద్యార్థులకు వ్యాధి సోకకుండా స్థానిక పీహెచ్‌సీ వైద్యులతో మాట్లాడి మందులను పంపిణీ చేశారు. అందరికీ మాస్క్‌లు అందించారు.
Comments
Please login to add a commentAdd a comment