
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం ఉదయం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరగనున్న జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. అనంతరం విజయవాడ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 7 గంటలకు జరిగే ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. రాత్రికి సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే బస చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.