
9 గంటలూ పగలే
వచ్చే ఏడాది రబీకి (రెండో పంట) పగటి వేళల్లోనే 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని
విద్యుత్‌పై సమీక్షలో సీఎం కేసీఆర్ స్పష్టీకరణ
వచ్చే ఏడాది రబీ నుంచి సరఫరా
మార్చి నాటికి 3 వేల మెగావాట్ల అదనపు విద్యుత్.. 2016 నాటికి రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉండదు
2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ
హైదరాబాద్: వచ్చే ఏడాది రబీకి (రెండో పంట) పగటి వేళల్లోనే 9 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. రాష్ట్రంలో 4,320 మెగావాట్ల విద్యుత్ లభ్యత వుందని, వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి మరో 3 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని సీఎం పేర్కొన్నారు. అప్పుడు రైతులకే తొలి ప్రాధాన్యత ఇచ్చి పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా చేయాలన్నారు. 2016 నాటికి తెలంగాణ విద్యుత్ కొరత లేని రాష్ట్రంగా మారుతుందని, 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రస్తుత విద్యుత్ సరఫరా, భవిష్యత్ డిమాండు-సరఫరా, నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించనున్న కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ తదితర అంశాలపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ రాజీవ్ శర్మ, ముఖ్యకార్యదర్శి నర్సింగ రావు, జెన్‌కో సీఎం డీ ప్రభాకర్ రావు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
‘విద్యుత్’ ఆలయాలు
నల్లగొండ జిల్లా దామరచర్లలో జెన్‌కో ఆధ్వర్యంలో 4,400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన మెగా థర్మల్ విద్యుత్ కేంద్రానికి ‘యాదాద్రి థర్మల్ స్టేషన్’గా ముఖ్యమంత్రి కేసీఆర్ నామకరణం చేశారు. నల్లగొండ జిల్లాలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టకు ఇటీవల ‘యాదాద్రి’గా నామకరణం చేసినందున అదే పేరును దామరచర్ల ప్లాంట్‌కు పెట్టారు. మణుగూరులో 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న థర్మల్ ప్లాంట్‌కు ఇదే కోవలో ‘భద్రాద్రి థర్మల్ కేంద్రం’గా నామకరణం చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా వుండగా.. పరస్పర భూ మార్పిడి విధానంలో యాదాద్రి ప్లాంట్ నిర్మాణం కోసం దామరచర్ల పరిసరాల్లోని 4,700 ఎకరాల అటవీ భూములను కేటాయిస్తూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టు పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తానని కేసీఆర్ చెప్పారు.