
కేరళ ప్రవాసీ పెన్షన్ స్కీమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధిలో భాగంగా కేరళీయులు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ఆ ప్రాంత ప్రజలతో మమేకం కావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అన్నారు. ముందుగా కేరళీయులు స్వరాష్ట్రం వదలి బయట ఉన్నప్పుడు అందరూ ఒక కుటుంబంలా ఐక్యంగా ఉండాలని సూచించారు.
కేరళ ప్రభుత్వం ప్రవాస కేరళీయులకు అండగా ఉంటుందని తెలిపారు. శనివారం రవీంద్రభారతిలో ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ (ఏఐఎంఏ) రాష్ట్ర యూనిట్, ప్రవాసీ వెల్ఫేర్ బోర్డ్, కేరళ ప్రభుత్వం సంయుక్త ఆధ్వ ర్యంలో కేరళ ప్రవాసీ పెన్షన్ స్కీమ్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా విజయన్ మాట్లాడుతూ కేరళ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కేవలం అక్కడ ఆదాయ వనరులే కాకుండా ప్రవాసీ కేరళీయుల సహకారం ఉందన్నారు. స్వరాష్ట్రం పట్ల ప్రవాసీ కేరళీయుల మమకారం మరువలేనిదని ఆయన కొనియాడారు.
కేరళ ప్రవాసీ పెన్షన్ స్కీమ్ ప్రారంభం
ప్రవాసీ కేరళీయుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే నూతనంగా కేరళ ప్రవాసీ పెన్షన్ స్కీమ్ ప్రారంభించామని తెలిపారు. 60 ఏళ్లు నిండిన ప్రవాసీ కేరళీయులకు రూ.2 వేలు పెన్షన్ స్కీమ్ ఏర్పాటు చేశామన్నారు.
అందుకు సంబంధించిన మొదటి పెన్షన్ కార్డును లబ్ధిదారులకి అందజేశారు. వైద్య సౌకర్యం కోసం అంబులెన్స్‌ను అందజేశారు. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ ఎస్.వేణుగోపాలాచారి మాట్లాడుతూ ప్రవాసీ కేరళీయుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రవాసీ కేరళ కళాకారులు నిర్వహించిన కలారిఫైట్(యుద్ధ విన్యా సాలు), పాటలు, జానపద గీతాలు అలరించాయి. కార్యక్రమంలో కేరళమంత్రి ఏకే బాలన్, ఏఐఎంఏ జాతీయ అధ్యక్షుడు గోపాలన్ పాల్గొన్నారు.