
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, అంబర్‌పేట: జీహెచ్‌ఎంసీని కైవసం చేసుకునే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు సమాయత్తం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ మొత్తానికి అంబర్‌పేట ఆదర్శంగా ఉండేలా పార్టీ శ్రేణులు అన్ని కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు. మజ్లిస్‌కు తొత్తుగా మారిన టీఆర్‌ఎస్ పార్టీ విధానాలపై ప్రజలను చైతన్యపరచాలని ఆయన సూచించారు. నాలుగు దశాబ్దాలుగా అంబర్‌పేట ప్రజలు ఎదురుచూస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంఐఎం పార్టీ అడ్డుపడుతుందని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం అంబర్‌పేట నియోజకవర్గం పార్టీ బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వందల కోట్లు ఫ్లైఓవర్ కోసం మంజూరు చేస్తే ఎంఐఎం పార్టీ పాతబస్తీలో మెట్రో ప్రాజెక్ట్‌ను అడ్డుకుంటున్నట్లు అంబర్‌పేటలో అడ్డుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రభుత్వం వ్యతిరేకమో అనుకూలమో సూటిగా చెప్పాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబర్‌పేట ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నియోజకవర్గ కుల సంఘాలు, యూత్ అసోసియేషన్‌లు, బస్తీ సంఘాలు, కాలనీ అసోసియేషన్ల వారు సీఎం కేసీఆర్‌కు లేఖలు రాసి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. నేనెక్కడున్నా అంబర్‌పేటతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తలెత్తుకునేలా వ్యవహరిస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీ బండి సంజయ్, బీజేపీ నగర అధ్యక్షులు రాంచందర్‌రావు, రాష్ట్ర నాయకులు మంత్రి శ్రీనివాస్, ప్రకాష్‌రెడ్డి, నగర మాజీ అధ్యక్షులు బి. వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.