కేకే ఓసీపీ భూమిపూజను అడ్డుకుంటాం
టీఫీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ
బెల్లంపల్లి/కాసిపేట : ఎర్రగుంటపల్లిలో మంగళవారం నిర్వహించనున్న కేకే ఓసీ ప్రాజెక్టు భూమిపూజను అడ్డుకుని తీరుతామని తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలమాస కృష్ణ స్పష్టం చేశారు. ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల తవ్వకాలకు అనుమతి మంజూరు చేసి టీఆర్‌ఎస్ ప్రభుత్వం జనవినాశనానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర సోమవారం బెల్లంపల్లి, కాసిపేట మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా బెల్లంపల్లి కాంటా చౌరస్తాలో నిర్వహించిన సభలో కృష్ణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు ఉండవని, భూగర్భ గనులు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ వాటి జోలికి వెళ్లకుండా ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
ప్రజలు, ప్రజాసంఘాల బాధ్యులు ఓసీపీలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసులు తీవ్ర నిర్భంధకాండను ప్రదర్శిస్తున్నారన్నారు. రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాల నాయకులు ఓసీకి వ్యతిరేకంగా మాట్లాడి ఇప్పుడు ఉలుకు, పలుకు లేకుండా ఉంటున్నారన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఓసీని అడ్డుకోవాలని కోరారు. తెలంగాణ నిర్వాసిత వ్యతిరేక ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు జంజర్ల రమేశ్‌బాబు మాట్లాడుతూ ఓసీలకు వ్యతిరేకమన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్తగా 17 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల తవ్వకాలకు అనుమతి మంజూరు చేసి తన నైజాన్ని చాటుకుందని విమర్శించారు. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలను బొం దల గడ్డగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కుటిల యత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏడాదికి రెండు పంటలు పండే పొలాలను బలవంతంగా గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఓసీపీల వల్ల 23 గ్రామాలు చితిమంటలు వెలిగించబోతున్నాయన్నారు. ప్రజాకళా మండ లి కళాకారులు చైతన్య గీతాలు అలపించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, చైతన్య మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనిత, తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర నాయకురాలు స్వాతి, ప్రజాకళా మండలి రాష్ట్ర గాయకుడు ఆశన్న, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పార్వతిరాజిరెడ్డి, టీవీవీ రాష్ట్ర అధ్యక్షుడు గురిజాల రవీందర్‌రావు, టీఫీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు దేవి సత్యం పాల్గొన్నారు.
సోమగూడెం వారసంతలో ప్రచారం
కాసిపేట మండలంలో నిర్వహించిన బస్సుయూత్రలో భాగంగా సోమగూడెం వారసంతో ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సోమగూడెంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం దుబ్బగూడెం, కాసిపేట గ్రామాల్లో బస్సుయాత్ర సాగింది. ఆదివారం ఇందారంలో ప్రారంభమైన బస్సుయాత్ర నెన్నెల, మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్, కాసిపేట లో కొనసాగి మంగళవారం ఎర్రగుంటపల్లికి చేరుకోనుంది.