
ఏప్రిల్‌లోగా నీళ్లివ్వకపోతే పోరాటమే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్‌పీ) కింద రెండు పంటలు పండా యని, రాష్ట్రం వచ్చాక ఒక్క పంటకే పరిమితం కావాల్సి వస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. సాగర్‌లో నీళ్లు ఉన్నా ఇవ్వలేకపోతున్నారని, ఏప్రిల్ 15లోగా చెరువులు నింపి నీళ్లు ఇవ్వకపోతే ఆందోళనకు దిగుతామని, తెలంగాణ ఉద్యమం తరహాలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. మిషన్ భగీరథ విషయంలో సీఎంను అభినందిస్తున్నామని, అయితే రూ.20 వేల కోట్ల విలువైన 26 ప్యాకేజీలను నలుగురు కాంట్రాక్టర్లకే దోచిపెడితే ఎలా? అని ప్రశ్నించారు.
సర్పంచ్ వేతనం 20 వేలకు పెంచాలి: కృష్ణయ్య
గ్రామీణ పంచాయతీ వ్యవస్థ బలోపేతం కావాలంటే 14వ ఆర్థిక సంఘం నిధులను ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని రూ.20 వేలకు పెంచాలన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనాలు కూడా పెంచాలన్నారు.
ఉపాధి కూలీల వేతనం పెంచాలి: సున్నం రాజయ్య
ఉపాధి హామీ పని దినాలను పెంచడంతోపాటు కూలీ మొత్తాన్ని రూ.300కు పెంచాలని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన గ్రామాల్లో త్రీఫేస్ కరెంటు ఇవ్వాలన్నారు.
వికారాబాద్‌కు అన్యాయం: రామ్మోహన్‌రెడ్డి
ప్రాజెక్టుల రీడిజైన్‌లో వికారాబాద్‌కు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రాణహిత–చేవెళ్ల ద్వారా నీళ్లు తేవాలని ప్రయ త్నిస్తే రీడిజైన్‌లో చేవెళ్ల లేకుండా పోయిందన్నారు. పాలమూరు– రంగారెడ్డిలోనూ మార్పులు చేయడం వల్ల నష్టం వాటిల్లిందన్నారు.